సోనూ సూద్ మరోసారి తన సామాజిక బాధ్యతని చాటుకున్నాడు. ‘కవర్ జి’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ప్రధానంగా గ్రామీణ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్న అపొహల్ని తొలగించటమే ‘కవర్ జి’ లక్ష్యం. ఎక్కడికక్కడ వాలంటీర్స్ ని తయారు చేసి ఊళ్లలోని అన్ని వర్గాల భారతీయులకి వ్యాక్సిన్ ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ఆసక్తి కలవారు, సేవా భావం ఉన్న వారు ఎవరైనా ముందుకు రావచ్చని సోనూ తెలిపాడు.
‘కవర్ జి’ పేరుతో సూద్ ప్రాంభించిన వెబ్ సైట్ లో ఆసక్తి కలవారు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత వ్యాక్సిన్ కు సంబంధించిన సమస్త సమాచారంతో కూడుకున్న శిక్షణని రిజిస్టర్డ్ వాలెంటీర్స్ కు అందిస్తారు. ఇక వారు తమ తమ పరిధుల్లో సామాన్య జనానికి వ్యాక్సిన్ గురించిన అవగాహన, చైతన్యం కలిగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ‘కవర్ జి’ ద్వారా సోనూ సూద్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకునేలా చేయాలని భావిస్తున్నాడట.
ఆన్ లైన్ లో సోనూ ప్రారంభించిన ‘కవర్ జి’ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతి కూడా ఉందని చెబుతున్నారు. అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడర్(ఏఎస్పీ) విభాగంలో ‘కవర్ జి’కి దిల్లీ నుంచీ అమోదం లభించింది. చూడాలి మరి, ఈ మధ్య రాజకీయ కోణంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సోనూ సూద్ తన తాజా ఆలోచనని ఎంత వరకూ ఆచరణలో పెట్టగలుగుతాడో…