భారతీయ సినీ సంగీత రంగంలో విశిష్ట స్థానం కలిగిన గాయకుడు బబ్లా మెహతా ఈ నెల 22న ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్’ గా గుర్తింపు పొందిన బబ్లా మెహతా, తన మధుర గాత్రంతో అనేక హిట్ పాటలను అందించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌తో కలిసి పాడే అరుదైన అవకాశం కూడా ఆయనకు లభించింది. గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత దర్శకుడిగా కూడా ఆయన కొన్ని చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. అలాగే అనేక ప్రైవేట్ ఆల్బమ్‌లను తన సంగీతంతో రూపొందించారు. ‘దిల్ హై కే మంత్ నహిన్’, ‘చాందిని’, ‘సడక్’, ‘తహల్కా’, ‘మేజర్ సాబ్’ వంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలు శ్రోతల మనసుల్లో నిలిచిపోయాయి. ఢిల్లీ స్వస్థలంగా కలిగిన బబ్లా మెహతా ఈ ఏడాది 65వ వయస్సులో మృతిచెందారు.