ఆగస్ట్ 12న అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది ‘షేర్ షా’ మూవీ. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జంటగా నటించిన ఈ సినిమా కెప్టెన్ విక్రమ్ బత్రా బయోపిక్. అయితే, వార్ మూవీ ‘షేర్ షా’లో హీరోయిన్ కియారాది కూడా కీలక పాత్రేనట. కథలో ఆమె చాలా ముఖ్యం అంటున్నాడు దర్శకుడు. తమిళంలో ‘బిల్లా, ఆరంభం’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన కియారాపై పొగడ్తల వర్షం కురిపించటం ఇప్పుడు బీ-టౌన్ లో చర్చగా మారింది. అంతే కాదు, ఏకంగా లేడీ సూపర్ స్టార్ నయనతారతో పోల్చేశాడు…
‘షేర్ షా’ చిత్రానికి సిద్ధార్థ్, కియారాలను ఎంచుకోవటం యాదృచ్ఛికంగా జరిగిందేం కాదట. వారిద్దరూ కథకి, పాత్రలకి సరిగ్గా సరిపోతారనే విష్ణువర్ధన్ సెలెక్ట్ చేసుకున్నాడట. ఇక కియారా అయితే చిన్న హింట్ ఇచ్చినా చాలు అల్లుకుపోతుందని ఆయన కితాబునిచ్చాడు. ఆమె చాలా షార్ప్ అండ్ స్మార్ట్ అన్న ఆయన నయనతారని గుర్తు చేసుకున్నాడు. గతంలో ‘బిల్లా, ఆరంభం’ సినిమాల సమయంలో నయన్ కూడా ఒక్క మాట చెబితే చాలు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చేదట. కియారా అద్వాణీకి కూడా పెద్దగా వివరించి చెప్పాల్సిన పనే లేదంటున్నాడు విష్ణు. ఆమె తాను ఏం చేయాలో అదంతా చకచకా చేస్తుందని వివరించాడు…
Read Also : నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ
‘షేర్ షా’ ట్రైలర్ ఇప్పటికీ జనాన్ని ఆకట్టుకుంది. స్టోరీ, మేకింగ్, యాక్టర్స్ పర్పామెన్స్ అన్నీ హైలైట్ గా ఉన్నాయి. అయితే, సిద్దూ, కియారా రియల్ లైఫ్ లోనూ జోడీగా కొనసాగుతుండటం సినిమాకి ప్లస్ గా మారుతోంది! హ్యాండ్సమ్ హీరో, ప్రెట్టీ హీరోయిన్ని తెరపై జంటగా చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.