Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!

Rao Bahadur Satyadev

Rao Bahadur Satyadev

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’. డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా సమర్పిస్తోంది. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో సత్యదేవ్ విలేకరుల సమావేశంలో పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

సినిమాపై ఉన్న నమ్మకం గురించి సత్యదేవ్ మాట్లాడుతూ “మేము ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ‘తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని చిత్రం’ అనే ట్యాగ్‌లైన్ అనుకున్నాం. సినిమా చూశాక సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ తో పాటు ఇప్పటివరకు చూసిన ఫిలిం మేకర్స్ అందరూ కూడా అదే మాట చెప్పారు. ఇదొక కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. ఇందులో మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్లుగా ఉంటాయి. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు హారర్ ఫీల్ కూడా కలుగుతుంది. ప్రేక్షకుడికి థియేటర్లలో ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.” అని ధీమా వ్యక్తం చేశారు.

నా యాక్టింగ్ డ్రీమ్ నెరవేరింది!
సినిమాలో తన పాత్ర కోసం పడ్డ కష్టం గురించి చెప్తూ, కమల్ హాసన్, విక్రమ్, సూర్య వంటి స్టార్స్ చేసిన హెవీ మేకప్ రోల్స్ చూసి తానూ ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయాలనుకున్నానని, ‘రావు బహదూర్’తో ఆ కల నెరవేరిందని సత్యదేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ప్రతిరోజూ మేకప్ వేయడానికే ఐదు గంటలు, తీయడానికి గంటన్నర పట్టేదని.. దీని కోసం శారీరక శ్రమతో పాటు మానసిక సహనం (మైండ్ మేకప్) చాలా అవసరమైందని తెలిపారు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు తన కెరీర్‌ను ‘రావు బహదూర్’కు ముందు, ‘రావు బహదూర్’కు తర్వాత అని మాట్లాడుకుంటారని నమ్ముతున్నట్లు చెప్పారు.

నాటి ‘సీతమ్మ వాకిట్లో..’ నుంచి నేటి వాయిస్ ఓవర్ వరకు
మహేష్ బాబు సపోర్ట్ గురించి సత్యదేవ్ ఎమోషనల్ అయ్యారు. “గతంలో మహేష్ బాబు గారి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నేను నటించాను, కానీ కొన్ని కారణాల వల్ల నా సీన్ కట్ అయింది. అలాంటిది ఈ రోజు ఆయన నా సినిమా చూసి 40 నిమిషాల పాటు మాట్లాడటమే కాకుండా, టీజర్‌కు తన వెలకట్టలేని వాయిస్ ఓవర్ ఇస్తూ ‘సత్యదేవ్ ఇన్…’ అని పలకడం నా లైఫ్ టైమ్ మెమరీ” అని చెప్పుకొచ్చారు. అలాగే నాని గారు కూడా ఈ సినిమా చూసి, “ప్రతి ఒక్కరూ డ్యూటీ చేస్తే సినిమా ‘రావు బహదూర్’లా ఉంటుంది” అని ప్రశంసించారని గుర్తుచేసుకున్నారు.

1960–99 మధ్య కాలంలో సాగే ఈ కథలో హీరో దేశసంచారి అని, తన ప్యాలెస్ ‘భువనాలయం’కు వచ్చాక ఏం జరిగిందనేదే అసలు కథ అని సత్యదేవ్ రివీల్ చేశారు. ఇందులో కమర్షియల్ యాక్షన్ సీన్స్ లేకపోయినా, నటనకు ప్రాధాన్యమున్న సీక్వెన్స్‌లు ఉంటాయన్నారు. తన కెరీర్‌లోనే మొదటిసారి ఈ సినిమా కోసం సాల్సా డ్యాన్స్ నేర్చుకున్నానని, ఇందులో రెండు అదిరిపోయే డ్యాన్స్ నంబర్స్ కూడా ఉన్నాయని తెలిపారు. హీరోయిన్ దీప థామస్ తనతో సమానంగా అద్భుతమైన నటన కనబరిచిందని, రాంజీ అందించిన సీజీ విజువల్స్, స్మరణ్ సాయి మ్యూజిక్ సినిమాకు ప్రాణమని కొనియాడారు. తమిళ, మలయాళ చిత్రాల తరహాలో మన దగ్గర ఎందుకు కొత్త తరహా సినిమాలు రావడం లేదనే ప్రేక్షకులకు ‘రావు బహదూర్’ ఒక గట్టి సమాధానం అవుతుందని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందని సత్యదేవ్ ముగించారు.