Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్‌గా వచ్చా: సాత్విక వీరవల్లి

Satvika Veeravalli

Satvika Veeravalli

Satvika Veeravalli: సాధారణంగా అమెరికాలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, చేతిలో రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు ఉంటే ఎవరైనా జీవితంలో సెటిల్ అయిపోయామని భావిస్తారు. కానీ సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆ భద్రత ఉన్న జీవితాన్ని కూడా వదులుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా సంయుక్త నిర్మాణంలో వస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సాత్విక తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

అమెరికాలో ఎంతో పేరున్న ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని ఇండియాకు వచ్చిన రోజును సాత్విక వేదికపై గుర్తుచేసుకున్నారు. “ఒరాకిల్ ఉద్యోగానికి రాజీనామా చేసిన రోజు నాకు ఒక్కసారిగా భయం వేసింది. నాలుగు ఏళ్ల వృత్తిపరమైన అనుభవం, రెండు ఇంజినీరింగ్ డిగ్రీలను దేనికోసం వదిలేస్తున్నాను? నా నిర్ణయం తప్పైతే ఏంటి? అని ఆ రోజు చాలా ఆందోళన చెందాను” అని సాత్విక తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత తన భయాలన్నీ పోయాయని ఆమె చెప్పారు. బాక్సాఫీస్ లెక్కలు, నంబర్ల కంటే.. వందలాది మంది ప్రేమ, కష్టంతో నిర్మించిన ఈ అందమైన సినిమాలో తాను భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒక్కరోజు కూడా తనకు ఇంటికి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ రాకుండా చిత్ర బృందం ఎంతో ఆప్యాయంగా చూసుకుందని కృతజ్ఞతలు తెలిపారు.

ఏ నటికైనా కలల లాంటి అరంగేట్రం తనకు దక్కిందని సాత్విక సంతోషం వ్యక్తం చేశారు. తనపై ఇంత పెద్ద నమ్మకం ఉంచిన నిర్మాతలు అల్లు అరవింద్, స్వప్న దత్, ప్రియాంక దత్, సందీప్, రమ్య, విద్య గార్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా స్టోరీ డిస్కషన్స్ నుంచి షూటింగ్ లాస్ట్ డే వరకు తనకోసం ఎంతో పోరాడిన దర్శకుడు పవన్ సాధినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ సాత్విక మురిసిపోయారు. తాను ఎన్నో ఏళ్లుగా అల్లు అర్జున్ యాక్టింగ్‌కి, ముఖ్యంగా ఆయన అద్భుతమైన డ్యాన్స్‌కు వీరాభిమానినని, ఆయన ఈ వేడుకకు రావడం తమ అదృష్టమని అన్నారు. అలాగే ఈ ఈవెంట్‌కు రాలేకపోయిన నటి శృతి హాసన్‌ను ‘పవర్ హౌస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్’ అని కొనియాడిన సాత్విక, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. తనతో పాటు నటించిన రోహిణి, శ్వాసిక, చైతు తదితర నటీనటులకు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మొదలైన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.