Tollywood Sankranthi : 2027 సంక్రాంతి సినిమాల సంగతేంటి?

Sankranthi

Sankranthi

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది. అయితే ఈ పండుగ శోభ ఇళ్లతో పాటు థియేటర్లలోనూ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది ఒక బిగ్గెస్ట్ సీజన్. సంక్రాంతికి లాంగ్ వీకెండ్ దొరకడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వినోదం కోసం థియేటర్ల వైపు అడుగులు వేస్తారు. అందుకే మన స్టార్ హీరోలందరూ తమ సినిమాలను ఈ బరిలో నిలపడానికి పోటీ పడుతూ ఉంటారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్.. ఇలా అన్ని రకాల జానర్ల సినిమాలు ఈ సీజన్ లో సందడి చేస్తాయి. పిండి వంటలు, గాలిపటాలతో పాటు థియేటర్లలో విజిల్స్, పేపర్ల ముక్కల హంగామాతో సంక్రాంతి సినిమా పండుగ హంగామా మామూలుగా ఉండదు.

2026 సంక్రాంతికి టాలీవుడ్ లో ఏకంగా ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచాయి. కేవలం 10 రోజుల్లో ఈ ఐదు సినిమాలు కలిపి దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో సంక్రాంతి సీజన్ మార్కెట్ పవర్ మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఈ 800 కోట్లలో ప్రతి సినిమాకు లాభం దక్కలేదు. కలెక్షన్స్ ఎక్కువగా కనిపించినంత మాత్రాన సినిమా సక్సెస్ అయినట్లు కాదు అని గత సంక్రాంతి నిరూపించింది. 2027 సంక్రాంతికి ‘మహాకాళి’, ‘జనవరి 12 విడుదల’, ‘సంబరాల ఏటిగట్టు’, ‘కాకా’, ‘జార్జ్ క్రిష్’ పొంగల్ బరిలోకి దిగుతున్నాయి. వీటిలో ముందుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో చిత్రం మహాకాళి.

పూజా అపర్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భూమి శెట్టి మహాకాళి పాత్రలో కనిపించనుండగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు. శ్రియా రెడ్డి, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లేడీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తూ ఉండడంతో, ఈ సినిమాపై ఆడియన్స్ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు చెబుతున్న మహాకాళికి కథ, వీఎఫ్ఎక్స్ (VFX), ప్రొడక్షన్ డిజైన్ మెయిన్ అట్రాక్షన్ గా మారుతున్నాయి. శుక్రాచార్యుడిగా పర్ఫార్మెన్స్, రక్తబీజుడి విధ్వంసం, ఆ తర్వాత ఓ సాధారణ మహిళ మహాకాళిగా అవతరించడం చుట్టూ కథ నడుస్తుందని గ్లిమ్స్ తో అర్థమవుతుంది. అయితే, హనుమాన్ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బడ్జెట్ కంటే అంచనాలే ఇప్పుడు ఈ సినిమాకు పెద్ద సవాలుగా మారాయి. జనవరి 8న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా, సంక్రాంతి సీజన్ ను ఎంతవరకు క్యాష్ చేసుకుంటుంది అనేది చూడాలి.

ఇక సంక్రాంతి బరిలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ తో వస్తున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణరామ్ తొలిసారి కలిసి నటిస్తూ ఉండగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్నాడు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పేరు నుంచి రిలీజ్ డేట్ వరకు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తుంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు ఎంతవరకు రప్పిస్తుంది అన్నదే కీలకం కానుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనిల్ రావిపూడి గత సంక్రాంతి సినిమాల సక్సెస్ ల ప్రభావం వల్ల భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్ కు కళ్యాణరామ్ ఇమేజ్ ను జోడించి ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సంక్రాంతి సెంటిమెంట్ ఒక్కటే సినిమాను గెలిపించదు; కంటెంట్ వర్కవుట్ అయితేనే పోటీలో నిలబడగలదు.

2027 రేస్ లో మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’, సాయి దుర్గ తేజ్ 125 సీఆర్ (Cr) పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల ఏటిగట్టు’తో పాటు వెంకటేష్, కళ్యాణరామ్ కాంబినేషన్ లో భారీ అంచనాల్లో బరిలోకి దిగుతున్నారు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా ‘సంబరాల ఏటిగట్టు’పై అంచనాలు ఉన్నాయి. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విరూపాక్ష, బ్రో తర్వాత సాయి దుర్గ తేజ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, భారీ విజువల్స్, సీజీ (CG) వర్క్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కానీ 125 కోట్ల పెట్టుబడికి సాయి దుర్గ తేజ్ ఇమేజ్ కి సంక్రాంతి సీజన్ లో వచ్చే వసూళ్లు సరిపోతాయా అన్నదే అసలు సమస్య. హనుమాన్ లాంటి సినిమాను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తూ ఉండడంతో అంచనాలు పెరిగాయి. అయితే భారీ బడ్జెట్ తో పాటు విఎఫ్ఎక్స్, సీజీ (CG) వర్క్స్ కారణంగా సినిమా నిర్మాణానికి సమయం పట్టడం కూడా ఈ ప్రాజెక్ట్ లో కనిపించిన మరో రిస్క్. మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ కూడా సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో అడుగు పెడుతుంది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో మాస్ ఆడియన్స్ లో సహజంగానే ఆసక్తి పెరిగింది. చిరంజీవి ఇందులో రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనుండగా, ప్రియమణి, అనవరరాజన్, అనురాగ్ కశ్యప్ లాంటి నటులు సినిమాకు అదనపు క్రేజ్ తీసుకొస్తున్నారు. జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఈ సినిమా.

శర్వానంద్, శ్రీను వైట్ల తొలిసారి కలిసి చేస్తున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ను జోడిస్తూ శ్రీను వైట్ల కొత్త తరహా ప్రయోగం చేస్తున్నాడు. ఇందులో శర్వానంద్ ‘జార్జ్’, ‘క్రిష్’ అనే రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మానసా వారణాసి, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా, శ్రీను వైట్ల మార్క్ కామెడీకి కొత్త కాన్సెప్ట్ ఎంతవరకు సెట్ అవుతుందనేది చూడాలి. జార్జ్ క్రిష్ సినిమాకు టైం ట్రావెల్, గ్రాఫిక్స్, సైన్స్ ఫిక్షన్ అంశాల కారణంగా బడ్జెట్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అయితే శ్రీను వైట్ల గత సినిమాల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ విషయంలో జాగ్రత్త అవసరమనే చర్చ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరోవైపు సినిమా ప్రారంభోత్సవం రోజే పలు ఏరియాల డిస్ట్రిబ్యూటర్ల వివరాలు ప్రకటించడం ప్రాజెక్ట్ పై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. కానీ పెట్టుబడి భారీగా ఉంటే సంక్రాంతి బరిలో కేవలం సినిమా హిట్ అయితే సరిపోదు, బిజినెస్ పరంగా కూడా వర్కవుట్ అయ్యేలా కలెక్షన్లు రావాలి.