Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటి వరకు తీసింది మూడు సినిమాలే అయినా, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆయన సృష్టించిన సంచలనాలు మామూలుగా లేవు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన, ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరి పేర్లతో పాటు బాలీవుడ్ హీరోల పేర్లను తెరపైకి తెస్తూ, ‘స్పిరిట్’ తర్వాత మా హీరోతోనే సినిమా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులతో హోరెత్తిస్తున్నారు.
అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి సందీప్ రెడ్డి వంగా స్వయంగా చెక్ పెట్టేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఆయన ఓపెన్‌గా చెప్పేశారు. ‘స్పిరిట్’ సినిమా పనులు పూర్తయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో క్రేజీ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ మొదలుపెట్టబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అటు బన్నీ, మహేష్, ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ హీరోల అభిమానుల ఆశలకు బ్రేక్ పడినట్లయింది. ‘స్పిరిట్’ పూర్తవ్వగానే సందీప్ మళ్లీ బీ టౌన్ బాట పట్టడం ఖాయమని తేలిపోవడంతో, ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

