Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..

Sampath Nandi

Sampath Nandi

Sampath Nandi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ దర్శకుడైనా ప్రాణం పెట్టి పనిచేయాలని అనుకుంటారు. కానీ, ఒకప్పుడు పవన్‌తో అధికారికంగా ప్రకటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రాజెక్ట్ నుంచి మాస్ డైరెక్టర్ సంపత్ నంది తప్పుకోవడం టాలీవుడ్‌లో పెద్ద సంచలనమైంది. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ చేతికి వెళ్లడంతో, పవన్-సంపత్ మధ్య ఏవో విభేదాలు తలెత్తాయంటూ అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. అయితే, తాను ఆ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వదులుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని సంపత్ నంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, పవన్ కళ్యాణ్‌తో ప్రాజెక్ట్ ఆగిపోయిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. నిజానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కథకు మొదట సంపత్ నందినే దర్శకుడిగా ఖరారు చేశారు. కానీ, అప్పట్లో పవన్ కళ్యాణ్ వరుస కమిట్‌మెంట్లు, ఇతర అనివార్య కారణాల వల్ల షూటింగ్ మొదలవ్వడం ఆలస్యమవుతూ వచ్చింది.

సంపత్ నంది మాట్లాడుతూ.. “ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపించడంతో, ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను పిలిపించుకుని మాట్లాడారు. సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది.. అప్పటివరకు వెయిట్ చేయగలరా? అని నన్ను నేరుగా అడిగారు. అయితే, ఆ గ్యాప్‌లో నేను మరో సినిమా పూర్తి చేసుకుంటే ఏమైనా అభ్యంతరం ఉందా సర్ అని అడిగాను. అందుకు ఆయన ఎంతో ఉదారంగా ఒప్పుకున్నారు. కేవలం షూటింగ్ లేట్ అవ్వడం, ఆ విరామాన్ని వృథా చేసుకోకుండా మరో సినిమా చేసుకోవాలనే ఆ ఒక్క కారణంతోనే ఎంతో సామరస్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను” అంటూ ఆయన స్పష్టం చేశారు.

రీమేక్ కథ కావడం వల్లే సంపత్ నంది ఆ సినిమాపై ఆసక్తి చూపలేదంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. తాను తెరకెక్కించాల్సింది ఏ రీమేక్ చిత్రాన్నో కాదని, పూర్తిస్థాయి ఒరిజినల్ కథతో రూపొందిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్నేనని తేల్చిచెప్పారు. అంతేకాదు, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత నిర్మాతల ద్వారా తనకు తెలిసిన ఓ విషయం తన మనసును కదిలించిందని సంపత్ నంది చెప్పారు. తనతో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ చివరి వరకు ఎంతో గట్టిగా ప్రయత్నించారని పలువురు నిర్మాతలు చెప్పారు. ఒక దర్శకుడి కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని, తన కోసం ఎక్కువ కాలం ఎదురుచూసేలా చేయడం పవన్‌కు ఏమాత్రం ఇష్టం ఉండదని, ఆయనతో కలిసి పనిచేసిన ఆ కొద్ది కాలం తన జీవితంలో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిందని సంపత్ నంది ఎమోషనల్ అయ్యారు.