Salman Khan: టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటనతో బాలీవుడ్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్‌లో సెక్యూరిటీని బాగా టైట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, 2026 ఏప్రిల్‌లో పట్టాలెక్కింది. ఇప్పటికే సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే, ఈ మధ్యకాలంలో టైగర్ ష్రాఫ్ మీద కాల్పులు జరిపిన తర్వాత విడుదలైన ఆడియోలో, సల్మాన్ ఖాన్‌తో ఎవరు పనిచేసినా వాళ్లని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సినిమా టీమ్ అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్‌పై గతంలో కూడా దాడి చేస్తామని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో, ముంబై ప్రభుత్వం ఆయనకు Y+ కేటగిరీ భద్రతను అందిస్తోంది. అయితే, తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సెక్యూరిటీ టీమ్‌తో పాటు నిర్మాణ సంస్థకు కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దాని ప్రకారం, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో జరిగే షెడ్యూళ్లను పూర్తిగా నిలిపివేయాలని లేదా వాటిని ప్రైవేట్ స్టూడియోలకు మాత్రమే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు సినిమా టీమ్ కూడా ఆ ఆదేశాలకు అనుగుణంగానే మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో, సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ లొకేషన్‌లో సాధారణ సిబ్బంది రాకపోకలపై కూడా కఠిన ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెండువేల ఇరవై ఏడులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

