తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, నటుడు – దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఎన్నో అడంకుల మధ్య నిన్న (మే 15, శుక్రవారం) థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక థియేటర్లో డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ భావోద్వేగానికి లోనై, హీరోయిన్ త్రిషను హగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
దాదాపు రూ. 140 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రం విడుదల ముందే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అనుకున్న సమయానికి థియేటర్లలో పడాల్సిన షోలు క్యాన్సిల్ అవ్వడం, పైరసీ భయాలు ముంచెత్తడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అయితే, అన్ని అడ్డంకులను దాటుకుని నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో, చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్లో డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ ఆనందాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అయ్యారు. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాలో రైల్వే స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎమోషనల్ సీన్ తరహాలోనే థియేటర్లో ఒక విజువల్ కనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల నుండి వచ్చిన ఈలలు, గోలలు, అరుపులు చూసి ఆర్‌జే బాలాజీ గాల్లోకి పిడికిలి బిగించి గట్టిగట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్నో రోజుల కష్టానికి ప్రతిఫలం దక్కడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
సినిమా ముగిసిన తర్వాత థియేటర్లోని అభిమానులందరూ బాలాజీ పేరును గట్టిగా నినదించడంతో ఆయన వెక్కివెక్కి ఏడ్చేశారు. అది చూసి పక్కనే ఉన్న హీరోయిన్ త్రిష వెంటనే ఆయనను హగ్ చేసుకుని, వీపు తడుతూ ఓదార్చారు. ఈ ఎమోషనల్ మూమెంట్‌లో వీరితో పాటు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్, సూర్య తమ్ముడు కార్తీ కూడా ఉన్నారు. “ఒక దర్శకుడికి ఇంతకంటే అసలైన విజయం ఏముంటుంది” అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
— Christopher Kanagaraj (@Chrissuccess) May 15, 2026
