RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్‌కు ముందు కొత్త వివాదం.. ఆర్‌జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!

Rj Balaji, Suriya, Veera Bhadrudu,

Rj Balaji, Suriya, Veera Bhadrudu,

దర్శకుడు ఆర్ జే బాలాజీ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలను, ఇక్కడి మేకింగ్ స్టైల్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన క్లిప్పింగ్స్ ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆర్ జే బాలాజీ తెలుగు ప్రేక్షకులపై, హీరోలపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ వీరాభిమానిని అని చెప్పి మెగా ఫ్యాన్స్ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన గతంలో చేసిన హేళన పూర్వక వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న నెటిజన్లు.. ‘మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడి, ఇప్పుడు తన సినిమాను చూడమని ఎలా అడుగుతారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఒక భాషా చిత్రాన్ని కించపరిచి, ఇప్పుడు అదే మార్కెట్ నుండి కలెక్షన్లు ఆశించడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మే 14న ‘వీరభద్రుడు’ విడుదల కాబోతున్న తరుణంలో ఈ వివాదం సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, దర్శకుడిపై వస్తున్న ఈ నెగిటివిటీ సినిమాపై కొంత ప్రతికూలతను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ జే బాలాజీ ఈ వివాదంపై స్పందించి స్పష్టతనిస్తారో లేదో చూడాలి. సూర్య-త్రిష క్రేజీ కాంబినేషన్ ఈ నెగిటివిటీని దాటుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.