RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?

Devisri Prasad's

Devisri Prasad's

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు. “దేవిశ్రీ ప్రసాద్ ఒక స్టార్. ఆయన సామర్థ్యం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇండియా మొత్తాన్ని ఊపేసే మ్యూజిక్ ఆయన ఇవ్వగలరు. ఆయనను తక్కువ అంచనా వేయలేము,” అని రవిశంకర్ అన్నారు.

అయితే, #RC17 నుంచి దేవిశ్రీ ప్రసాద్‌ను ఎందుకు తప్పించారనే ప్రశ్నకు స్పందిస్తూ.. “అది పూర్తిగా డైరెక్టర్ సుకుమార్ గారి నిర్ణయం. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి వస్తారు. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి,” అని ఆయన తెలిపారు. ఇంతకుముందు సుకుమార్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. కానీ, ఈ సినిమాకు మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కాకుండా వేరే సంగీత దర్శకుడిని ఎంచుకోవాలని సుకుమార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.