మాస్ మహారాజా రవితేజ ఇటీవలే ‘ఇరుముడి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సాధించిన సూపర్ హిట్‌తో ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరుముడి సినిమాకు పారితోషికం తీసుకోకుండా, నైజాం రైట్స్ లాభాల్లో పర్సెంటేజ్ తీసుకున్నారు. ఆ రూపంలో ఒప్పందం కుదుర్చుకున్న రవితేజ, ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే ఆర్జించినట్లు సమాచారం. నైజాం పరిధిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా జాక్‌పాట్ కొట్టామని, ఈ సినిమాతో మాస్‌రాజా భారీగా లాభపడ్డారని ఇటీవలి బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బహిరంగంగా వెల్లడించారు.
అయితే, ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ తన తదుపరి సినిమాలకు పర్సెంటేజ్ పద్ధతి కాకుండా, ఏకంగా రూ. 50 కోట్ల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, దిల్ రాజు నిర్మాణంలో రాబోయే రవితేజ ప్రాజెక్ట్ సంక్రాంతి రేసు నుంచి వాయిదా పడటానికి ఈ పారితోషికం పెంపే ప్రధాన కారణమని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని సినిమాలు ‘ఇరుముడి’లాగా భారీ లాభాలు తెచ్చిపెట్టవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ‘ధమాకా’ వంటి పెద్ద హిట్ వచ్చిన తర్వాత రవితేజ వరుసగా 6 ఫ్లాపులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అందులో కొన్ని సినిమాలు కనీసం రూ. 10 కోట్ల గ్రాస్ కూడా సాధించలేక డిజాస్టర్లుగా మిగిలాయి. తదుపరి చిత్రం హిట్ అయితే పర్వాలేదు కానీ ఒకవేళ తేడా కొడితే రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాతల పరిస్థితి ఏంటని ట్రేడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

