Spirit: దీపావళి లాంటి పండగ సీజన్లో సినిమాను దించడం అంటే మామూలు విషయం కాదు. థియేటర్ల కోసం, సోలో రిలీజ్ కోసం నిర్మాతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఎవరికీ తెలియకుండా ఒక స్టార్ హీరో ఇచ్చిన సీక్రెట్ లీక్‌తో, మరో పాన్ ఇండియా సినిమా ఏకంగా దివాళీ డేట్‌పై కర్చీఫ్ వేసినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ మూవీ తాజా రిలీజ్ డేట్ వెనుక ఉన్న అసలు కథ ఇదేనంటూ సినీ వర్గాల్లో బలమైన గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘స్పిరిట్’ చిత్రాన్ని 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇటీవల సందీప్ వంగా అధికారికంగా ప్రకటించారు. అయితే అదే సమయానికి రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దీంతో ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి మంచి ఫ్రెండ్స్‌గా మారిన సందీప్, రణ్‌బీర్ బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడతారేమోనని అంతా భావించారు. కానీ తెర వెనుక ఇంకో కథ నడిచిందట. షూటింగ్, నిర్మాణ పనుల కారణంగా ‘రామాయణ 2’ అనుకున్న టైంకి థియేటర్స్‌లోకి రావడం కష్టమని, రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న విషయం హీరో రణ్‌బీర్‌కు తెలియడంతో.. ఆయన వెంటనే తన దోస్త్ సందీప్ వంగాకు ఈ సమాచారం చేరవేశారట.
సమాచారం అందిన వెంటనే సందీప్ రెడ్డి వంగా ఏమాత్రం ఆలోచించకుండా నిర్మాతలతో మాట్లాడి.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్లను కొల్లగొట్టేందుకు ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావించారు. వెంటనే ఆ డేట్‌ను ‘స్పిరిట్’ కోసం లాక్ చేసి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ బయటికి రాలేదు. అయినప్పటికీ, రణ్‌బీర్ ఇచ్చిన ఆ ఒక్క హింట్‌తో ప్రభాస్ సినిమాకు రూట్ క్లియర్ అయిందంటూ ఈ ప్రచారం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

