Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్‌లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!

Ranbir Kapoor

Ranbir Kapoor

Ranbir Kapoor: ఆస్తి పంపకాలు, చిన్నపాటి మనస్పర్థలకే తోడబుట్టిన వాళ్లు కోర్టు మెట్లు ఎక్కుతున్న రోజులివి. అలాంటిది అన్న రాముడి కోసం రాజభోగాలను, సుఖాలను వదులుకుని పద్నాలుగేళ్ల పాటు అడవుల బాట పట్టిన లక్ష్మణుడి త్యాగం.. ఈ ఆధునిక కాలంలో సాధ్యమేనా? అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఎదురైన ఈ ప్రశ్నకు రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో నేటి లైఫ్‌స్టైల్, రిలేషన్స్ గురించిన చర్చ నడిచింది. “టెక్నాలజీలో మనం ఎంత ముందుకెళ్లినా, మనుషుల మధ్య మాత్రం ఆ బాండింగ్ మిస్సవుతోంది. అన్న కోసం అన్నీ వదులుకుని 14 ఏళ్లు అడవులకు వెళ్లిన లక్ష్మణుడి లాంటి తమ్ముడిని ఈ రోజుల్లో చూడగలమా?” అని హోస్ట్ అడిగారు.

దీనికి రణ్‌బీర్ కపూర్ అత్యంత ఆలోచింపజేసే రీతిలో స్పందించారు. “రామాయణంలో కనిపించే ప్రతి పాత్ర, బంధం నేటి సమాజానికి ఒక పర్ఫెక్ట్ మోడల్. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో శ్రీరాముడు, లక్ష్మణుడి పాత్రలు చాటిచెప్పాయి. ఆ స్థాయిలో త్యాగం చేయగలగడం చరిత్రలో నమోదైందంటే.. ఆ మానవీయ విలువలు ఇప్పటికీ మనుషుల అంతరంగంలో ఉన్నాయనే అర్థం. కాకపోతే నేటి బిజీ లైఫ్‌లో, స్వార్థపు పోటీలో ఆ ‘మర్యాద’, ‘ధర్మం’ కాస్త మరుగున పడి ఉండొచ్చు కానీ పూర్తిగా అంతరించిపోలేదు. రామాయణం లాంటి కథలు చెప్పడం వెనుక అసలు ఉద్దేశమే అది. కుటుంబంలో, అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన నిజమైన ప్రేమను, నిస్వార్థ బంధాన్ని ఇది నేటి తరానికి బలంగా గుర్తుచేస్తుంది” అంటూ రణ్‌బీర్ చెప్పుకొచ్చారు. తోబుట్టువుల మధ్య ఆప్యాయతలు తగ్గిపోతున్న ఈ కాలంలో లక్ష్మణుడి నిస్వార్థ త్యాగాన్ని, రామాయణ విలువలను ప్రస్తావిస్తూ రణ్‌బీర్ చేసిన ఈ కామెంట్స్ సినీ అభిమానులతో పాటు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.