Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్‌లో ‘రామాయణ’ సంబరాలు!

Ramayana

Ramayana

Ramayana: రణ్‌బీర్‌ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘రామాయణ’ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటిపోయింది. దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే భారత్‌లోనే కాకుండా.. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఈ సినిమా ఫీవర్ మామూలుగా లేదు. కరాచీ నగరంలోని ఓ ప్రముఖ ఆలయంలో అక్కడి స్థానిక హిందువులు ‘రామాయణ’ సినిమా పోస్టర్‌కు ప్రత్యేక పూజలు చేస్తూ హారతులు ఇస్తున్న దృశ్యాలను సుమిత్ చంద్ర అనే లోకల్ యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

“పాకిస్థాన్‌లో ఉంటున్న మాకు ‘రామాయణ’ అనేది కేవలం రెండు గంటల సినిమా మాత్రమే కాదు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆత్మగౌరవం, తరతరాల సంస్కృతి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాలి” అంటూ అక్కడి ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్ల పాక్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా లేదా అన్నది ఇంకా తేలనప్పటికీ.. కరాచీ గుడిలో పోస్టర్ పెట్టి సంబరాలు చేసుకునే స్థాయికి క్రేజ్ చేరడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.