Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!

Peddi1 (1)

Peddi1 (1)

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, ఈ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. అదనపు ధరలు పెంచుకునేందుకు వీలుగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారంటూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక, హోంశాఖ జారీ చేసిన సదరు మెమో పూర్తిగా అక్రమమని తేల్చిచెప్పింది.

‘పెద్ది’ సినిమా విడుదలైన రోజు నుంచి అంటే జూన్ 4 నుంచి దాదాపు 10 రోజుల పాటు థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు వీలుగా ఈ నెల 2వ తేదీన హోంశాఖ ఒక ప్రత్యేక మెమో జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, సినిమా టికెట్ల ధరల నియంత్రణకు సంబంధించి గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, న్యాయస్థాన ఉత్తర్వులను పూర్తిగా ధిక్కరిస్తూ ఈ మెమో జారీ చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

×
×
Ad

ఈ క్రమంలో కోర్టు విచారణ జరిపి “సినిమా టికెట్ల ధరల సవరణ లేదా పెంపుదల ప్రక్రియ అనేది పూర్తిగా పారదర్శకంగా జరగాలి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ‘జీవో 121’ (GO 121) లో పొందుపరిచిన నియమ నిబంధనలను మాత్రమే అనుసరించాలి. అలా కాకుండా కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ఇలాంటి మెమోలు జారీ చేయడం చట్టవిరుద్ధం.” స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ టికెట్ల పెంపు వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, చిత్ర యూనిట్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.