తనదైన విప్లవ భావాలతో, నిక్కకచ్చిగా మాట్లాడే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తాజాగా సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెన్సార్ అధికారుల కత్తెరపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణమూర్తి.. సెన్సార్ బోర్డుతో పాటు ప్రస్తుత తరం స్టార్ హీరోల పనితీరుపై ఘాటు విమర్శలు చేశారు. సినిమా టైటిల్‌లో ‘కామ్రేడ్’ అనే పదం ఉండటంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిందన్న వార్తలపై నారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కామ్రేడ్ అంటే ఒక అమ్మ, ఒక నాన్న.. ప్రజల కోసం పోరాడే ప్రతి వ్యక్తీ కామ్రేడే. అలాంటి మహోన్నతమైన పదాన్ని చూసి సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పడం ఎంతవరకు ధర్మం? గతంలో ఎన్టీఆర్ గారు యమగోల సినిమాలో ‘మై డియర్ కామ్రేడ్స్’ అనలేదా? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బూతులు ఉండే సినిమాలను గుడ్డిగా వదిలేస్తూ, ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. “ఓటీటీలు, యూట్యూబ్‌లలో ఏవేవో భీభత్సంగా వస్తున్నాయి, వాటిని మీరు ఆపలేరు. దయచేసి లక్షలాది మందికి అన్నం పెడుతున్న సినిమా తల్లిని మానసికంగా హింసించకండి” అంటూ సెన్సార్ పెద్దలకు ఆయన చేతులెత్తి దండం పెడుతూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదే వేదికపై స్టార్ హీరోల కమర్షియల్ మైండ్‌సెట్‌పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో కృష్ణ లాంటి మహానటులు ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని కలకలలాడేలా చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి హీరోలు ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ, శ్రీవిష్ణు లాంటి వారు మాత్రమే ఏ భేషజాలు లేకుండా కొత్త నిర్మాతల కోసం తలుపులు తెరుస్తున్నారని ప్రశంసించారు. స్టార్ హీరోలంతా సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని ఎక్కువ సినిమాలు చేయాలని, జనాలకు దగ్గరగా ఉంటూ నిర్మాతలనూ, ఇండస్ట్రీని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదొక నక్సలైట్ సినిమా అనుకున్నానని, కానీ టీజర్, పాటలు చూశాక ఇదొక అద్భుతమైన ప్రేమకథగా అర్థమైందని నారాయణమూర్తి కొనియాడారు. మనిషి నక్సలైట్‌గా మారడం వెనుక ఒక బలమైన కారణం, పెద్ద కథ ఉంటుందని, ఆ పాయింట్‌తో దర్శకుడు జానకి శ్రీరామ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. కోన వెంకట్ ఈ సినిమాకు వెన్నెముకగా నిలవడం గొప్ప విషయమన్న ఆయన, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

