Ravi Shankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత వై.రవిశంకర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా లాంగ్ రన్, కలెక్షన్ల ట్రెండ్ – నటీనటుల పర్ఫార్మెన్స్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నిన్న సెకండ్ టైమ్ హీరో గారితో కలిసి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూశాను. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎంత హెవీ ఎమోషన్ ఫీల్ అయ్యామో, రెండోసారి అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ అనిపించింది. సినిమా అయిపోయాక రామ్ చరణ్ గారు చాలా ఫాస్ట్‌గా, చలాకీగా నడుచుకుంటూ వెళ్తుంటే.. ‘అరే ఈయన కాలు బాగాలేదు కదా.. ఇంత ఫాస్ట్‌గా నడుస్తున్నారు ఏంటి?’ అని మేమంతా అనుకున్నాం. అంటే స్క్రీన్‌పై చరణ్ గారి నటన చూసి మేమంతా ఆ ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాం. ఒంటి చేత్తో కాదు.. ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నడిపించి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు” అని కొనియాడారు.
విలక్షణ నటుడు జగపతి బాబు క్యారెక్టర్ గురించి చెబుతూ.. “మా మైత్రీ మూవీ మేకర్స్ మొదటి సినిమా ‘శ్రీమంతుడు’ నుంచి జగపతి బాబు గారితో ఎన్నో సినిమాలు చేశాం. కానీ ‘పెద్ది’ సినిమాలో ఆయన ఇచ్చింది బెస్ట్ పర్ఫార్మెన్స్. కథలో యూటర్న్ ఆయన పాత్రతోనే మొదలవుతుంది. అక్కడి నుంచి ఎమోషన్ ఆగలేదు. రిలే రేస్‌లో బ్యాటన్ అందించినట్లు జగపతి బాబు గారి నుంచి చరణ్ ఆ ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లారు” అని పేర్కొన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబును అభినందిస్తూ.. “ప్రేక్షకులు ఎప్పుడూ వంద మందిని కొట్టే రెగ్యులర్ విలనిజం చూసి చూసి ఉన్నారు. అలాంటి టైమ్‌లో ‘పెద్ది’ ఎడారిలో ఓయాసిస్ లాంటి మంచి రిలీఫ్ ఇచ్చింది. కొత్తదనం కోరుకునే వారికి, ఫ్యామిలీ అంతా కలిసి ఒక క్లీన్ సినిమా చూడాలనుకునే వారికి ‘పెద్ది’ ఒక సింగిల్ పాయింట్ స్టాప్. ఈ జూన్ నెలాఖరు వరకు నాలుగు, ఐదు వారాల పాటు థియేటర్లు కలకలలాడుతూనే ఉంటాయి. మెగా హీరోల సినిమాలు ఒకసారి పట్టుకుంటే వదలవు.. ఇది లాంగ్ రన్ ఉండబోతోంది” అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం స్కూల్స్ రీ-ఓపెన్ అవుతున్న నేపథ్యంలో పేరెంట్స్‌కు ఆయన ఒక ప్రత్యేక రిక్వెస్ట్ చేశారు. “ఇప్పుడు స్కూల్స్ బిగిన్ అయ్యే టైమ్. పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే.. మీ పిల్లల స్కూల్ ఫీజులు, యూనిఫార్మ్స్ కొనే బడ్జెట్‌లో ‘పెద్ది’ సినిమా టికెట్ల కోసం కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి. పిల్లలు హాస్టల్స్‌కు, స్కూల్స్‌కు వెళ్లేముందు ఈ సినిమా చూపిస్తే.. అకడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. స్పోర్ట్స్ అయినా, చదువు అయినా వాళ్లలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీయడానికి ఇది ఎంతో ఇన్స్పిరేషనల్‌గా ఉంటుంది” అని రవిశంకర్ అన్నారు. సోమవారం కలెక్షన్ల ట్రెండ్ పై ఆయన స్పందిస్తూ.. “ఈరోజు సోమవారం నూన్ షోస్, మ్యాట్నీలు, ఫస్ట్ షోలు అన్ని ఏరియాల్లో ఫుల్స్ అవుతున్నాయి. కలెక్షన్ల పరంగా చూస్తే క్యుములేటివ్ నంబర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కొన్ని టెర్రిటరీలలో ‘ఎ’ సెంటర్లు, మరికొన్ని చోట్ల ‘బి, సి’ సెంటర్లు అదరగొడుతున్నాయి. దీన్ని బట్టి ‘పెద్ది’కి ఏ, బి, సి తేడాలు లేవు.. ఇది ‘ఆల్ ఏబీసీ’ సినిమా అని అర్థమైంది. నెక్స్ట్ సక్సెస్ మీట్ పెట్టే సమయానికి సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి, ఓవర్‌ఫ్లో కలెక్షన్లతో మాట్లాడతాం” అని అన్నారు.

