Priya Bhavani Shankar : రహస్యంగా ఎగేజ్మేంట్ చేసుకున్న ఇరుముడి హీరోయిన్?

Priya Bhavani Shankar

Priya Bhavani Shankar

వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాలేజీ రోజుల నుంచే రాజ్ వేల్ అనే వ్యక్తితో గాఢ ప్రేమలో ఉన్న ప్రియా, ఆయనతో కలసి ఉన్న సరికొత్త ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా, అందులో వారిద్దరి మెడలో మల్లెపూల దండలు ఉండటం, వెనుక నేపథ్య సంగీతంగా మంగళ వాయిద్యాలు, శుభసూచకమైన పెళ్లి గీతాలు వినిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందని, త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా ఇలాంటి విజువల్స్ బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి, బుల్లితెర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా, ‘మేయాద మాన్’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కడైకుట్టి సింగం’, ‘మాన్‌స్టర్’, ‘తిరుచిత్రంబలం’, ‘భారతీయుడు 2’, ‘డిమాంటీ కాలనీ 2’ వంటి వరుస చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా స్థిరపడ్డారు. ఇటీవల ఆమె నటించిన ఇరుముడి తెలుగు సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఏకంగా 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. కెరీర్ అత్యున్నత దశలో ఉన్న తరుణంలోనే ప్రియా తన చిరకాల ప్రియుడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవ్వడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ నిశ్చితార్థంపై ప్రియా భవాని శంకర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.