ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా… నటుడిగా ఈ మధ్య కాలంలో భిన్నపాత్రలు చేస్తున్నాడు. ఆ మధ్య ‘మెర్క్యురీ’ చిత్రంలో డిఫరెంట్ గెటప్ తోనూ తన అభిమానులను అలరించాడు ప్రభుదేవా. తాజాగా సంతోష్ పి జయకుమార్ తెరకెక్కిస్తున్న ‘పోయిక్కల్ కుతిరై’ మూవీ లో ఆర్టిఫిషియల్ లెగ్ తో ఈ డాన్సింగ్ స్టార్ దర్శనమివ్వబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రగ్గడ్ లుక్ తో భుజంపై ఓ పాపను ఎత్తుకుని, శత్రువులతో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రభుదేవా ఈ పోస్టర్ లో ఫోజ్ ఇచ్చాడు. అయితే… ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించింది, ఆసక్తిని కలిగించింది వేరే ఉంది. అదే ప్రభుదేవా కాలు! ఇందులో ప్రభుదేవాది ఒకటి నేచురల్ లెగ్ కాగా, మరొకటి పోస్తటిక్ లెగ్. తాను అవిటివాడిగా మారడానికి కారణమైన వారిపై ప్రభుదేవా ఎలా పగతీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథాంశమని టీమ్ సభ్యులు చెబుతున్నారు.
Read Also : ‘ఫరాజ్’… జూలై 1, 2016… ‘ఆ రాత్రి’ ఏం జరిగింది?
మొత్తానికి ఓ మంచి విజయం కోసం ప్రభుదేవా దివ్యాంగుడి పాత్ర చేయడానికి సైతం సై అనేశారని తెలుస్తోంది. ఇలా ఒంటి కాలితో పోరాటలు చేయడం సాహసమే కాకుండా, కష్టం కూడా. కానీ వాటన్నింటినీ ప్రభుదేవా ఓర్పుతో చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, రైజా విల్సన్, ప్రకాశ్ రాజ్, సముతిరకని, జాన్ కొక్కెన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించాడు. గతంలో దర్శకుడు సంతోష్ పి జయకుమార్ ‘హర హర మహాదేవ్ కీ’, ‘గజనీకాంత్’ చిత్రాలు రూపొందించాడు. మరి ప్రభుదేవాతో ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఎలా తీస్తాడో చూడాలి.