Operation Arunareddy : జూలై 17న పోసాని కృష్ణమురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’

Operation Aruna Reddy

Operation Aruna Reddy

వైవిధ్యమైన సినిమాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ పోసాని కృష్ణమురళి. తాజాగా ఆయన ఆల్‌రౌండ్‌ బాధ్యతలు నిర్వహిస్తూ తెరకెక్కించిన వినూత్న చిత్రం “ఆపరేషన్ అరుణారెడ్డి”. ‘3 ఇడియట్స్ మూవీస్’ సమర్పణలో, ‘యుపి సినిమా లైన్స్’ మరియు ‘కుసుమ ఎంటర్ టైన్ మెంట్స్’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది.

ఈ చిత్రానికి పోసాని కేవలం నటుడు, దర్శకుడు, నిర్మాత మాత్రమే కాదు.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే స్వయంగా చూసుకోవడం విశేషం. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. “రచయితగా వంద సినిమాలు రాశాను, నటుడిగా వందలాది చిత్రాల్లో అలరించాను. కానీ, నా కెరీర్‌లోనే అత్యుత్తమ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన చిత్రం ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అని గర్వంగా చెప్పగలను. మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ప్రేక్షకుడు ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ఒక్క అసభ్యకర సన్నివేశం గానీ, బూతు మాట గానీ లేకుండా క్లీన్‌గా, ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నా మిత్రుడు, నిర్మాత శ్రీనివాస్ అందించిన సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరగా పూర్తయి విడుదలకు సిద్ధమైంది” అని అన్నారు. బీజేపీ నాయకుడు రఘునందన్ రావు, ఆయేషా భాను, సాయి మణికంఠ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ విలక్షణ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పోసాని కృష్ణమురళి మార్క్ డైలాగ్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.