కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో గ్లామర్ డాల్ పూజా హెగ్డే చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరికీ స్వీర్ సర్ప్రైజ్ ఇస్తోందట. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అలాగే పూజ నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో ఈ బ్యూటీ తన స్వగ్రామమైన మంగుళూరుకు వెళ్లిందట. ఆమె స్వస్థలమైన మంగుళూరులో పూజాహెగ్డేకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలో ఈ సంవత్సరం మామిడి పండ్ల దిగుబడి చాలా ఎక్కువగా వచ్చిందట. దీంతో పూజా సొంత తోటలో పండిన మామిడి పండ్లను టాలీవుడ్‌లోని తన అభిమాన దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల ఆమె మొదటి ప్యాక్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది నిర్మాతలకు పంపింది. రేపటి నుంచి ఆమె తన జాబితాలోని దర్శకులు, హీరోలు, నిర్మాతలందరికీ మామిడి పండ్ల ప్యాక్‌లు పంపిణి చేస్తుందట. హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్, యువి ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ నిర్మాతలు తమ ప్యాక్‌లను త్వరలోనే అందుకోనున్నారు. డిజె, అరవింద సమేత, ముకుంద, ఒక లైలా కోసం, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఇటీవలే పూజాహెగ్డే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.