Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా ఎమోషనల్‌గా సాగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకలో, దర్శకుడు పవన్ సాధినేని తన 13 ఏళ్ల సినీ ప్రయాణంలోని అనుభవాలను గుర్తుచేసుకుంటూ కదిలిపోయారు. ముఖ్యంగా తన కెరీర్ మొదట్లో ‘రేసుగుర్రం’ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తన పట్ల చూపించిన అభిమానాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని పవన్ అన్నారు. తన మొదటి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’ విడుదలైన రోజులను గుర్తుచేసుకుంటూ పవన్ సాధినేని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “నా మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు దాన్ని ఎవరైనా చూస్తారా లేదా అనే భయంలో ఉన్నాను. అలాంటి సమయంలో నాకు మొదట ఫోన్ చేసింది బన్నీ అన్న. అప్పుడు ‘రేసుగుర్రం’ షూటింగ్ జరుగుతోంది. నన్ను సెట్‌కు పిలిపించి, తన క్యారవాన్‌లో కూర్చోబెట్టుకుని నా సినిమాలోని ప్రతి సీన్ గురించి ఎంతో వివరంగా మాట్లాడుతూ మెచ్చుకున్నారు. అప్పుడు నాకు ఇది నిజమా కలా అన్నంత ఆశ్చర్యం కలిగింది. అన్ని వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన నాకు, ఆ రోజు మీరు ఇచ్చిన ఆ పుష్, ఆ మాటలే ఈ 13 ఏళ్ల ప్రయాణంలో నన్ను నడిపించాయి” అని పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇండస్ట్రీలో తన 13 ఏళ్ల ప్రయాణంలో ఎదురైన పరిస్థితులను కూడా పవన్ ఓపెన్‌గా పంచుకున్నారు. “ఈ 13 ఏళ్లలో ఇండస్ట్రీలో ఎన్నో దశలు చూశాను. నిజం చెప్పాలంటే ఒక రకమైన అలసట వచ్చేసింది. ఆ 13 ఏళ్ల అలసటను ప్రేమగా మారిస్తే ఎలా ఉంటుందో అదే ‘ఆకాశంలో ఒక తార’. ఈ కథ పట్టుకుని ఎంతోమంది దగ్గరికి వెళ్లాను. కానీ నేను ఈ సినిమా తీయగలనా లేదా అనే ఏదో ఒక అనుమానం అందరిలోనూ ఉండేది. దుల్కర్ సార్ దగ్గరికి వెళ్లినప్పుడు కూడా ఏదో మొహమాటానికి వింటారేమో అనుకున్నాను. కానీ కథ విన్న రోజు నుంచి ఇప్పటివరకు ఒక్కరోజు కూడా నాపై అనుమానం పడకుండా, ఒక నటుడిగా పూర్తిగా నన్ను నమ్మారు. ఆయన లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు” అని పవన్ అన్నారు.
2020 కరోనా సమయంలో ఈ కథ రాసుకున్నానని, అల్లు అరవింద్, విద్య గారు కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ముందుకు వచ్చారని పవన్ తెలిపారు. స్వప్న దత్ రాకతో ఈ ప్రాజెక్ట్ ఒక మ్యాజిక్‌లా మారిందన్నారు. ఇక కొత్త హీరోయిన్ సాత్విక ఎంపిక గురించి మాట్లాడుతూ.. “ఈ పాత్రకు ఎవరిని తీసుకోవాలని అల్లు అరవింద్ సార్, మేము ఎన్నో ఆప్షన్లు చూశాం. ఒక కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని ఇండియా అంతా వెతికి టైమ్ వేస్ట్ చేశాం. కానీ ఏడు సముద్రాల అవతల అమెరికాలో ఉన్న సాత్విక గురించి తెలిసి అడిగిన వెంటనే, ఆమె అన్ని వదులుకుని ఇక్కడికి వచ్చి అద్భుతంగా నటించింది” అని మెచ్చుకున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథ విన్న మొదటి రోజే ‘ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, నువ్వు ఎలా తీసినా బాగుంటుంది’ అని ధైర్యం ఇచ్చారని, ఇప్పుడే మిక్సింగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూసి వచ్చానని, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని పవన్ అన్నారు. మీ ఇళ్లలోని ఆడపిల్లలు, తల్లులు, భార్యలందరి కలలు నెరవేరాలనే మంచి ఆలోచనతో వస్తున్న ఈ సినిమా అందరినీ కదిలిస్తుందని పవన్ సాధినేని అన్నారు.

