తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాల కోసం ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాదికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తూ ఈ అవార్డులను అందజేస్తోంది. 2014 సంవత్సరానికి గాను ‘పాఠశాల’ చిత్రం సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది.
రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మాణంలో మాహి వి. రాఘవ దర్శకత్వంలో రూపొందిన ‘పాఠశాల’ చిత్రం, ఐదుగురు మిత్రులు ఐదు వారాల పాటు 5000 కిలోమీటర్ల ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను ఆవిష్కరిస్తూ, యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అద్భుతంగా చిత్రీకరించిన కథాచిత్రం. హృదయాన్ని హత్తుకునే కథనం, ఆకర్షణీయమైన సంగీతం, అద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు 2014 సంవత్సరానికి గాను గద్దర్ సినీ అవార్డ్స్‌లో సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికై, ఈ చిత్రం మరోసారి గుర్తింపు పొందింది.
‘పాఠశాల’ చిత్రం 2014 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపిక కావడంపై చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. “మా చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గుర్తింపు ‘పాఠశాల’ చిత్రం యొక్క శాశ్వత ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోంది” అని వారు తెలిపారు.