Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..

Pa Ranjith Constitution Day Post

Pa Ranjith Constitution Day Post

Pa.Ranjith: రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా ప్రముఖ తమిళ దర్శకుడు పా.రంజిత్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మన రాజ్యాంగం విలువ ఏంటో గుర్తుచేస్తూనే, నేటి సమాజంలో జరుగుతున్న వివక్షలపై ఆయన సూటిగా స్పందించారు. భారత రాజ్యాంగం అంటే ఏదో కొన్ని చట్టాలు, రూల్స్ రాసి ఉన్న పుస్తకం మాత్రమే కాదని పా.రంజిత్ అన్నారు. తమ హక్కుల కోసం నిలబడే అణగారిన వర్గాల గొంతుక అది అని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించిన అసలైన పునాది అని ఆయన రాసుకొచ్చారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి రాజ్యాంగమే రక్షణ కవచమని చెప్పారు. ఏదో ఒక్క రోజు రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని మాట చెబితే సరిపోదని, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోరుకున్నట్లుగా ప్రతిరోజూ రాజ్యాంగ విలువలను పాటిస్తూ దాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ కులం, మతం, భాష, లింగం, ఆర్థిక స్థాయి లాంటి ఎలాంటి భేదాలు లేకుండా ఆత్మగౌరవంతో, సమానత్వంతో బతికే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే, ఇప్పటికీ సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, మత విద్వేషాలు, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి తోడు భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులు మన ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలుగా మారాయని ఆయన అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ మహా గ్రంథం చరిత్రలో నిలిచిపోయేదని పా.రంజిత్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ప్రసంగాలు ఇప్పటికీ మనకు దారి చూపిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన సామాజిక న్యాయం, సోదరభావం, స్వేచ్ఛ, సమానత్వం లాంటి విలువలను కాపాడుకుంటూ.. వాటికి వ్యతిరేకంగా జరిగే ప్రతి వివక్షను ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎదుర్కోవాలని ‘జై భీమ్’ నినాదంతో ఆయన తన పోస్ట్‌ను ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.