గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో కానీ, అన్ని అడ్డంకులే. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్‌లో ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదాలు చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, మురుగన్.. పేర్లు వేరైనా ‘గాడ్ ఆఫ్ వార్’ (వార్ ఆఫ్ గాడ్) గా పిలుస్తారు. దేవుడి కథతో సోషియో మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఎన్టీఆర్ మూవీ రూపొందనుంది. అయితే మురుగన్ జీవిత చరిత్రను టచ్ చేస్తూ తమిళంలో రెండు సినిమాలు రూపొందుతున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా ‘సేయాన్’ సినిమా రూపొందుతోంది. గాడ్ ఆఫ్ వార్ కథను తమిళంలో పోటీ పడి తీస్తున్నారు. ధనుష్ హీరోగా నటించే ‘తమిళ మురుగన్’ కూడా ఇలాంటి కథతోనే రూపొందుతోంది. రీసెంట్‌గా దీని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోరాట కథలు రాసే వెట్రిమారన్ మైథలాజికల్ జానర్ టచ్ చేస్తూ ‘తమిళ మురుగన్’ను తీయడం విశేషం.
కార్తికేయ జీవిత కథలతో రెండు తమిళ సినిమాలు ‘సేయాన్’, ‘తమిళ మురుగన్’ రూపొందుతున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ఇంతవరకు మొదలు కాలేదు. సెట్స్ పైకి రావడానికి ఇంకో ఏడాది పడుతుంది. ఈలోగా ‘సేయాన్’, ‘తమిళ మురుగన్’ రిలీజ్ అయిపోతాయి. ఈ రెండు కథలతో త్రివిక్రమ్ కథ కాస్త మ్యాచ్ అయితే మాత్రం మళ్ళీ మార్పులు చేర్పులు తప్పవు. ఒకవేళ మార్చే అవకాశం లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ‘సేయాన్’, ‘తమిళ మురుగన్’ రిలీజ్ అయ్యాకే ఎన్టీఆర్ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తారని తెలిసింది. రెండేళ్లుగా గురూజీ రాసుకుంటున్న కథకు తంబీలు బ్రేకులు వేశారు.
మురుగన్ కథతో రూపొందుతున్న తమిళ సినిమాల సంగతి తర్వాత.. ముందు గురూజీ కథే కాంట్రవర్సీ అయింది. సినిమాను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ట్యాగ్‌లైన్‌లో సుబ్రహ్మణ్య స్వామి నార్త్‌లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్‌లో పుట్టాడంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. తమిళ మనోభావాలని దెబ్బతీసేలా క్యాప్షన్ ఉందంటూ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్‌టీకే అధినేత సీమాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ దేవుడి పుట్టుక గురించి తప్పుడు ప్రచారం చేస్తే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.
కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి సోషల్ మీడియాలో రెండు వర్గాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. హిందూ పురాణంలో కుమారస్వామి హిమాలయాల్లో జన్మించారని చిత్ర యూనిట్‌కు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. పోస్టర్‌లో కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి రాయడంతో రచ్చ మొదలైంది. ఇదే విషయాన్ని సినిమాలో చూపిస్తే తంబీల మనోభావాలు దెబ్బతినడం ఖాయం, సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటారు. ఈ కాంట్రవర్సీ నుంచి బయటకు రాకుండానే మురుగన్ కథతో రెండు తమిళ చిత్రాలు తెరపైకి రావడంతో గురూజీ టీం షాక్ అయింది. మరి ఈ వరుస వివాదాల నుంచి ‘గాడ్ ఆఫ్ వార్’ ఎలా బయటపడుతుందో చూడాలి. అలానే త్రివిక్రమ్ రాసుకుని చేస్తున్న వెంకటేష్ AK 47 కూడా ఇదేరకమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

