చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కానీ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ కు 30 సంవత్సరాలు. అయితే ఇరవై, ఇరవై రెండేళ్ళలోనే సంగీత దర్శకుడిగా మారేసరికీ అంతా అతని పాటల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. పైగా తొలిచిత్రం ‘3’లోని కొలవరి డీ పాటతో జాతీయ స్థాయిలో అనిరుథ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం క్రితమే అతను తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కొందరు జోస్యం చెప్పారు. ఆ నేపథ్యంలో అనిరుథ్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా ‘అజ్ఞాతవాసి’ పరాజయం పాలైంది. దాంతో అనిరుథ్ మనకు పనికి రాడనే ముద్ర వేసేశారు తెలుగు సినీజనాలు. కానీ ఆ తర్వాత అనిరుథ్ సంగీతం అందించిన ‘జెర్సీ’ చక్కని విజయాన్నే సొంతం చేసుకుంది. కానీ ఆ వెనుక వచ్చిన ‘నానిస్ గ్యాంగ్ లీడర్’ పరాజయం పాలైంది. ఆ రకంగా అనిరుథ్ కు తెలుగులో రావాల్సినంత పేరు గానీ, క్రేజ్ గానీ రాలేదు. అయితే… ప్రతిభ ఉన్న వాళ్ళకు ఒకసారి కాకపోతే మరోసారి గుర్తింపు, అవకాశం లభించడం ఖాయం. దానికి తాజాగా ఉదాహరణగా అనిరుథ్ నే చెప్పుకోవచ్చు. అతని ఖాతాలో ఇప్పుడు ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోస్ మూవీస్ పడబోతున్నాయి. ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాకు అనిరుథ్ సంగీతం అందించబోతున్నాడు. ఇంతవరకూ కొరటాల శివ డైరెక్ట్ చేసిన చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వచ్చాడు. అయితే తాజా చిత్రం ‘ఆచార్య’కు మాత్రం మణిశర్మను తీసుకున్నారు. ఇప్పుడు ఎన్టీయార్, కొరటాల సినిమాకి అనిరుథ్ రవిచందర్ ను ఎంపిక చేశారట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే… రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తొలుత ఎ.ఆర్. రెహమన్ సంగీతాన్ని అందిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూ అనిరుథ్ పేరే వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన విజయ్ ‘మాస్టర్’కు సంగీతం అందించి, అనిరుథ్ స్టార్ హీరోలకూ తాను సక్సెస్ ఫుల్ ఆల్బమ్ ను ఇవ్వగలనని నిరూపించుకున్నాడు. ఆ కారణంగా ఈ రెండు చిత్రాల దర్శక నిర్మాతలూ అతని వైపు మొగ్గు చూపారనిపిస్తోంది.
Read More:ఈ సారి ‘మా’ అధ్యక్షుడు ఎవరు?