Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తన చిన్ననాటి సినీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నితీష్ తివారీ మాట్లాడుతూ.. “నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ‘శివ’ అనే సినిమా చూశాను. అసలు ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేశారో కూడా నాకు అప్పట్లో తెలీదు. కానీ నాగార్జున గారి నటన, అమల గారి స్క్రీన్ ప్రెజెన్స్, రఘువరన్ గారి క్రేజీ విలనిజం చూసి పిచ్చెక్కిపోయింది. ఇంతటి అద్భుతమైన సినిమాను ఎవరు తీశారని ఆరా తీస్తే.. రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ పేరు తెలిసింది. సరిగ్గా ఆ సినిమా నుంచే నాకు తెలుగు సినిమాలపై అమితమైన ఇష్టం ఏర్పడింది. అప్పటి నుంచే టాలీవుడ్ సినిమాలను క్రమం తప్పకుండా ఫాలో అవ్వడం మొదలుపెట్టాను” అని చెప్పారు.
ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రతిబంధ్’ చూశానని నితీష్ పేర్కొన్నారు. “ఆ సినిమా చూశాకే నాకు ఒక పెద్ద విషయం అర్థమైంది. సినిమాలకు ముఖ్యం కావాల్సింది భాష కాదు.. గుండెలకు హత్తుకునే అసలైన ఎమోషన్ మాత్రమే అని తెలుసుకున్నాను” అంటూ చిరంజీవి నటన తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. కాలేజీ రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు హైదరాబాద్కు చెందిన ఒక రూమ్మేట్ ద్వారా మరిన్ని మంచి తెలుగు సినిమాలు పరిచయమయ్యాయని చెప్పారు. “అలా మణిరత్నం గారి క్లాసిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ చూశాను. అందులోని పాటలు నా మనసులో అలా ముద్రపడిపోయాయి” అంటూ వేదికపైనే మైక్ అందుకుని “నంది కొండ వాగుల్లోనా.. నల్ల తుమ్మ చెట్టు నీడల్లో..” అంటూ అచ్చతెలుగులో పాట పాడి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఒక టాప్ బాలీవుడ్ డైరెక్టర్ మన పాత తెలుగు పాటను ఇంత చక్కగా పాడటంతో ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది. హాస్టల్ రోజులు పూర్తయి బయటకు వచ్చినా తెలుగు సినిమాలు చూడటం ఆపలేదని, ‘ఈగ’, ‘మగధీర’ చూశానని, ‘బాహుబలి’ని హిందీలో ఎంజాయ్ చేశానని తెలిపారు. “తెలుగు ఇండస్ట్రీలో డైరెక్షన్తో మాయ చేసే అసలైన మెజీషియన్స్ ఉన్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ వంటి ఎంతోమంది బ్రిలియంట్ డైరెక్టర్లు టాలీవుడ్లోనే ఉన్నారు” అంటూ తెలుగు దర్శకులపై ప్రశంసల వర్షం కురిపించారు.

