నలభై యేళ్ళ బాలీవుడ్ నటి నేహా ధూపియా తెలుగులోనూ ‘నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమ వీరచక్ర’ వంటి చిత్రాలలో నటించింది. మూడేళ్ళ క్రితం మే 10న నటుడు అంగద్ ను వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే… కరోనా కారణంగా ఈ ప్రేమజంట ఇప్పుడు వేరువేరు నగరాల్లో ఐసొలేషన్ లో ఉండిపోయారు. తమ మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్త అంగద్ కు సోషల్ మీడియా ద్వారానే నేహా ధూపియా ప్రణయసందేశం పంపింది. ‘నువ్వు నేను వేరు వేరు ప్రాంతాల్లో లేము, ఒకే చోట ఉన్నమనే నేను భావిస్తున్నాను. ఓ పెద్ద చెట్టు నీడలో మనిద్దరం ఉన్నామని, మన పాప నీతో హాయిగా ఆడుకుంటోందనే భావిస్తున్నాను’ అంటూ కవితాత్మకంగా తన మనసులో భావాన్ని వారిద్దరి పాత ఫోటోలతో సహా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంగద్ సైతం అదే తరహాలో తన భావాలను వ్యక్తం చేశాడు. కొన్నేళ్ళ పాటు డేటింగ్ చేసిన నేహా, అంగద్ 2018 మే 10న పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత ఆరు నెలలకే నవంబర్ లో వారికో పాప పుట్టింది. ఆ చిన్నారికి మెహర్ అనే పేరు పెట్టారు.