టాలీవుడ్‌లో ‘అంటే సుందరానికీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నజ్రియా తన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? భర్త, ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్‌తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు.
సాధారణంగా ప్రేమ, పెళ్లి బంధాలలో ఉండే లోపాలను లేదా మోసాలను సూచించడానికి సోషల్ మీడియాలో ‘రెడ్ ఫ్లాగ్’ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. నజ్రియా తన స్టోరీలో.. “రెడ్ ఫ్లాగ్‌ల వెనుక పరిగెత్తే బుల్స్(ఎద్దులు) పరిస్థితి గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని.. కానీ ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే తయారైంది” అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో నజ్రియా వైవాహిక జీవితంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏప్రిల్‌లో కూడా తాను పర్సనల్ ఎమోషనల్ ఇబ్బందుల వల్లే పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉంటున్నట్లు నజ్రియా పేర్కొంది. అలాగే కెరీర్, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోమంటూ గతంలో ఆమె పెట్టిన పోస్టులను కూడా ఫ్యాన్స్ ఇప్పుడు లింక్ చేస్తూ ఆందోళన చెందుతున్నారు.
నజ్రియా పోస్ట్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. కొందరు సినిమా విశ్లేషకులు, అభిమానులు అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇదంతా నజ్రియా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదని, ఆమె నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగమేనని కొట్టిపారేస్తున్నారు. నజ్రియా ప్రస్తుతం టోవినో థామస్ సరసన ‘ఎల్ క్లాసికో’ అనే సినిమాలో నటిస్తోంది. స్పెయిన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బుల్ ఫైట్, ఫుట్‌బాల్ ఆటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఇటీవలే స్పెయిన్ లోని ఒక ప్రముఖ స్టేడియంలో ఈ టైటిల్‌ను మేకర్స్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ లో బుల్స్ ను రెచ్చగొట్టడానికి రెడ్ ఫ్లాగ్ వాడుతుంటారు. కాబట్టి, నజ్రియా పెట్టిన పోస్ట్ పక్కా పి.ఆర్ స్టంట్ అని, సినిమాలోని కాన్సెప్ట్‌ను హింట్ ఇవ్వడానికే ఈ ‘రెడ్ ఫ్లాగ్’ పోస్ట్ పెట్టిందని ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నజ్రియా, బేసిల్ జోసెఫ్ తో చేసిన ‘సూక్ష్మదర్శిని’ చిత్రం తర్వాత.. సూర్య హీరోగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తోంది. మరి ఈ ‘రెడ్ ఫ్లాగ్’ పోస్ట్‌పై నజ్రియా స్వయంగా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

