Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!

Nayanthara

Nayanthara

Nayanthara: సాధారణంగా మన సౌత్ సినిమాల్లో 50, 60 అడుగుల ఆకాశమంత కటౌట్లు అంటే కేవలం స్టార్ హీరోలకే కనిపిస్తుంటాయి. కటౌట్ ఎంత ఎత్తు ఉంటే ఆ హీరో క్రేజ్ అంత పెద్దది అన్నట్లుగా లెక్కలేసుకునే సంప్రదాయం చాలా ఏళ్లుగా నడుస్తోంది. కానీ తొలిసారి ఆ పద్ధతిని బద్దలు కొడుతూ.. ఒక హీరోయిన్ కోసం ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్ వెలిసింది. ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని ఈ సీన్ చూసి తోటి హీరోయిన్ ఆశ్చర్యపోతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార మెయిన్ రోల్ చేస్తున్న తాజా సినిమా ‘మూకుత్తి అమ్మన్ 2’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమిళనాడులో నయనతారకు ఈ భారీ కటౌట్ కట్టారు. ఎరుపు, బంగారు రంగు పట్టుచీరలో, చేతిలో త్రిశూలం పట్టుకుని అమ్మవారి రూపంలో ఉన్న ఈ కటౌట్ అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు సౌత్‌లో ఏ హీరోయిన్‌కు కూడా ఈ స్థాయి కటౌట్ పడకపోవడంతో నయన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.

ఈ 60 అడుగుల కటౌట్ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నటి రెజీనా చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. “సౌత్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కోసం ఇంత పెద్ద కటౌట్ కట్టడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. నిజంగా ఇదొక చరిత్ర. నయనతార పట్టుదలకు, కష్టానికి ఇది నిలువెత్తు నిదర్శనం” అంటూ నయన్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. తోటి హీరోయిన్ సాధించిన ఘనతను ఓపెన్‌గా పొగుడుతూ రెజీనా చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ సినిమా కోసం ఈ రేంజ్ కటౌట్ కనిపించడంతో సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. “లేడీ సూపర్ స్టార్ అంటే ఊరికే అనలేదు.. ఆమె ఇమేజ్ ముందు హీరోలు కూడా సరిపోరు” అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటే, మరికొందరేమో ఇంత ఖర్చు పెట్టి ఈ కటౌట్‌ను నిజంగా అభిమానులు పెట్టారా లేక సినిమా యూనిట్ వాళ్లే ప్రమోషన్ల కోసం పెట్టించారా అంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా హీరోల సెంట్రిక్‌గా సాగే ఇండస్ట్రీలో నయనతార 60 అడుగుల కటౌట్‌తో తన క్రేజ్ ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు రుచి చూపించారని అంటున్నారు.