Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్

Naresh

Naresh

Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నరేష్ ఓ సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. “ఇది కొంచెం రిస్క్ కావచ్చు.. కానీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. మీకు సినిమా నచ్చకపోతే, సినిమా బాగోలేకపోతే.. గచ్చిబౌలిలోని విజయకృష్ణ టవర్స్ ఉంది కదా, అక్కడే ఉంటా రండి! నేనేం జోక్ చేయట్లేదు.. నిజంగానే చెప్తున్నా. మా టీమ్ మొత్తం అక్కడే ఉంటుంది, మేము ఎవరికీ భయపడం. సినిమా ఎందుకు నచ్చలేదో వచ్చి చెప్పండి.. మేము ఎదురుచూస్తాం” అంటూ ప్రేక్షకులకు బహిరంగ సవాల్ విసిరారు.

దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ‘క్రేజీ కల్యాణం’ ప్రత్యేకంగా నిలుస్తుందని నరేష్ వెల్లడించారు. “ఇప్పటివరకు నేను చేసిన 300 చిత్రాల్లో ఇది నా బెస్ట్ క్యారెక్టర్. ఇంతకంటే మించిన పాత్ర మళ్లీ చేయాలంటే నేను చాలా ఆలోచించాలి. ప్రతి క్యారెక్టర్‌ను అతికించినట్లు కాకుండా, ప్రతి నటుడు ఇందులో జీవం పోశారు. రక్తపాతాలు, సూసైడ్లు, అనవసరపు బిల్డప్పులు లేకుండా సాగే పక్కా ఆర్గానిక్ అండ్ హానెస్ట్ ఎంటర్‌టైనర్ ఇది” అని స్పష్టం చేశారు. ప్రస్తుత సినిమా పరిస్థితులు, టికెట్ రేట్లపై కూడా నరేష్ ప్రాక్టికల్‌గా స్పందించారు. “ప్రేక్షకులను మోసం చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. టికెట్ రేట్లు పెరిగిపోయాయి.. టైమ్ కూడా చాలా విలువైంది. ఇవాళ థియేటర్‌కు వెళ్లాలంటే రెండు గంటలు జర్నీ, లోపల రెండు గంటలు సినిమా, దానికితోడు రెండు వేల రూపాయల ఖర్చు అవుతోంది. అందుకే ప్రేక్షకులు హానెస్ట్ కంటెంట్ కోరుకుంటున్నారు. ఆ విషయంలో ఈ సినిమా వంద శాతం న్యాయం చేస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై నరేష్ చూపించిన నమ్మకం, ఆయన విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.