ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ లో నిర్మాతగా తన పట్టు బిగిస్తున్నారు. దాదాపు పది చిత్రాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. కొన్ని సినిమాలను ఆయన సొంతంగానూ, మరి కొన్ని సినిమాలను భాగస్వాములతోనూ కలిసి నిర్మాణం జరుపుతున్నారు. విశేషం ఏమంటే… చిత్ర నిర్మాణంలో రాజీ పడకపోవడం తన నైజం అని తొలి చిత్రం ‘లవ్ స్టోరీ’తోనే నిరూపించారు నారాయణ్ దాస్ నారంగ్. పూర్తిగా కొత్త వాళ్ళతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన ఆయన… అవుట్ పుట్ అనుకున్న విధంగా రాకపోవడంతో దాన్ని పక్కన పెట్టి, నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోనే ‘లవ్ స్టోరీ’ని నిర్మించారు. ఈ సినిమా తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
Read Also : ‘రాధేశ్యామ్’ తేదీకి వస్తున్న ఆ ఐదు చిత్రాలు!
ఇదిలా ఉంటే… ఇప్పుడు నాగచైతన్య తండ్రి నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. దీనితో పాటు శరత్ మరార్ తో కలిసి నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో ‘లక్ష్య’ చిత్రాన్ని నిర్మించారు నారాయణ దాస్ నారంగ్. ఈ సినిమా కూడా తుదిమెరుగుల్లో ఉంది. ఇక సుధీర్ బాబు హీరోగా, ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్థన్ తో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. దీనితో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇవి కాకుండా నిఖిల్ 20వ చిత్రాన్ని తామే నిర్మిస్తున్నట్టు ఇప్పటికే నారాయణదాస్ నారంగ్ తెలిపారు. అలానే ‘మేజర్’లో నటిస్తున్న అడివి శేష్, శర్వానంద్, తమిళ నటుడు శివకార్తికేయన్ లతో కూడా వీలువెంబడి సినిమాలను నిర్మించబోతున్నారు ఈ సీనియర్ ఫిల్మ్ పర్సనాలిటీ! ఇప్పటికే తెలంగాణలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న నారాయణ దాస్ నారంగ్, ఆయన తనయుడు సునీల్ నారంగ్… మహేశ్ బాబుతో కలిసి ఎ.ఎం.బి. మల్టీప్లెక్స్ ను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో వందల థియేటర్ల నిర్వహణ కూడా నారాయణదాస్ నారంగ్ చేతిలోనే ఉండటం విశేషం. ఈ రకంగా తెలుగు సినిమా రంగంలోని ప్రధాన శాఖల్లో ఏషియన్ ఫిలిమ్స్, ఎస్వీసీసీ ప్రొడక్షన్ హౌస్ తమ సత్తాను చాటుతున్నాయి.