Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున

Credit To Itlu Arjun Team

Credit To Itlu Arjun Team

Itlu Arjun: కింగ్ నాగార్జున సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, రోజురోజుకూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ‘శివ’ థియేటర్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నాగార్జున పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిత్రబృందానిదేనని, ఇందులో తన పాత్ర కేవలం చివర్లో వచ్చి ప్రెజెంట్ చేయడం వరకేనని ఆయన నిరాడంబరంగా చెప్పారు. సినిమాకు షో షోకు మౌత్ టాక్ పెరగడంతో పాటు కలెక్షన్లు పుంజుకోవడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. “ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ నేను అస్సలు తీసుకోను. నేను ఏదో పైపై మాటలుగా చెప్పడం లేదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. రెండున్నరేళ్ల పాటు ఎంతో ప్యాషన్, కమిట్‌మెంట్‌తో ఈ చిత్రబృందం ఈ సినిమాను చెక్కుకుంటూ ఇంతదూరం తీసుకొచ్చారు. అసలైన కష్టమంతా వారిదే. నేను కేవలం చివర్లో వచ్చి సినిమా చూసి, నాకు నచ్చి ప్రెజెంట్ చేస్తానని ముందుకు వచ్చాను. నేను ప్రెజెంట్ చేసినందుకు నా మాట నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ నాగార్జున ‘హార్ట్ బస్టర్’ సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని టీమ్‌కు ఇచ్చేశారు.

తొలి సినిమాలోనే మాటలు రాని మూగవాడి పాత్రను ఎంచుకుని అనీష్ డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాడని నాగార్జున మెచ్చుకున్నారు. అలాగే తెలుగు తెలియకపోయినా అనశ్వర రాజన్ అద్భుతంగా నటించిందని, సినిమా చూసిన వెంటనే తాను ఆమెకు పెద్ద అభిమానిగా మారిపోయానని తెలిపారు. మాటలు రాని అబ్బాయి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే అమ్మాయి మధ్య కథను దర్శకుడు మహేష్ ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా నడిపించారని, ఆయన ‘లంబీ రేస్ కా ఘోడా’ అని కొనియాడారు. ఇక తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నిలబెట్టారని ప్రశంసించారు. ఇదే సమయంలో, ఈ సినిమాలో అనీష్ రూఫ్ మీద పరిగెత్తే షాట్ చూసి ముచ్చటపడే డీవోపీ రాజాను తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’కు సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. అలాగే ‘శివ’ సినిమా ఫస్ట్ కాపీ చూసింది ఇదే థియేటర్‌లో అని గుర్తుచేసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.