టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అదికూడా తెలుగులో “అధికారిక ప్రకటన” (Official Announcement) అంటూ పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ పెట్టి ఆమె ఒక నోట్ విడుదల చేయడంతో, అభిమానులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏదైనా కొత్త సినిమా కబురో, లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంచలన నిర్ణయమో ఉంటుందని ఆతృతగా చదివిన నెటిజన్లకు, అందులో ఉన్న అసలు విషయం తెలిసి ముసిముసి నవ్వులు వస్తున్నాయి..ఆ నోట్లో నభా తన తల్లికి బహిరంగ క్షమాపణలు చెబుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. “ఇటీవల నాకు తెలిసొచ్చిన ఒక నిజాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మ సలహాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకోకుండా, నాకే ఎక్కువ తెలుసని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పడం లేదు… మా అమ్మ చెప్పేది కరెక్టే.” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.
ఏం తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, అతిగా ఆలోచించడం ఎప్పుడు ఆపాలి, ఆఖరికి కడుపు నొప్పి వచ్చినా ఏం చేయాలన్న దానికి అమ్మ దగ్గరే సరైన సమాధానం ఉంటుందని నభా పేర్కొంది. అయితే తాను మాత్రం మొదట అడగాల్సిన అమ్మను వదిలేసి గూగుల్‌లో వెతకడం, రీల్స్ చూడటం, ఫ్రెండ్స్‌ని అడగడం లాంటివి చేసి ఏవేవో చిట్కాలు ప్రయత్నిస్తుంటానని సరదాగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ఆమె చెప్పిన క్షమాపణ. “అమ్మా, అందరి ముందూ ఒప్పుకోవడం కొంచెం కష్టంగానే ఉంది… కానీ ఈసారి కూడా నువ్వే కరెక్ట్. నీ మాట విననందుకు ఇదే నా బహిరంగ క్షమాపణ. ఇక నువ్వు ‘నేను ముందే చెప్పాను కదా!’ అనేలోపే…” అంటూ తన పోస్ట్‌ను ముగించింది. మొదట “అధికారిక ప్రకటన” అని చూసి ఏదో సీరియస్ మేటర్ అనుకున్న అభిమానులు, చివరికి అది తల్లిపై ప్రేమతో కూడిన సరదా పోస్ట్ అని తెలుసుకుని ఆకట్టుకునే కామెంట్లు పెడుతున్నారు. ప్రతి ఇంట్లో అమ్మాయిల పరిస్థితి ఇంతేనంటూ నెటిజన్లు నభా పోస్ట్‌కు తెగ కనెక్ట్ అవుతున్నారు.

