పుష్ప 2 రిలీజ్ అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు దర్శకుడు సుకుమార్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం అనౌన్స్ చేశారు. సుమారు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. ఒక రోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా మెగా కాంపౌండ్ వర్సెస్ అల్లు కాంపౌండ్ అనే వార్తల నేపథ్యంలో నిన్న మెగా బ్రదర్ నాగబాబు సినిమాని ఆదరించాలని పేరు ప్రస్తావించకుండానే మెగా అభిమానులకు సూచనలు చేశారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు యెర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్ వెళ్లారు.
Allu Arjun: అల్లు అర్జున్ టీమ్ పై కేసు నమోదు
వారితో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లారు. ఇక వీరితోపాటు మైత్రి మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ కూడా ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకోవడం కోసమే మెగా నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా ఈ చర్యతో మెగా అభిమానుల సోషల్ మీడియా టార్గెటింగ్ నుంచి పుష్ప 2 మూవీ కాస్త బయటపడొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాలో ఎవరిని ఉద్దేశించి డైలాగులు లేకపోయినా రకరకాల డైలాగులు సృష్టించి మరి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు సైతం ఏవీ కన్ఫామ్ చేసుకోకుండా వాటి మీద స్పెషల్ డిబేట్లు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో మైత్రి నిర్మాతలు మెగాస్టార్ నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంకా సినిమా చూడాల్సి ఉంది. చూశాక ఎప్పటిలానే ఆయన రివ్యూ షేర్ చేస్తారేమో చూడాలి.