మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి, అఖిల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన మైత్రి వారు ఇప్పుడు మెగా హీరోతో మరో ప్రాజెక్టుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో మైత్రి మూవీ మేకర్స్ రెండు ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్ ‘ఉప్పెన’ను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. ‘ఉప్పెన’ భారీ కలెక్షన్లు సాధించి వైష్ణవ్ తేజ్ కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా మిగిలింది. ఇక ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్… వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు స్క్రిప్ట్‌లను ఎంచుకునే బాధ్యతను సుకుమార్‌కు అప్పగించారు. సుకుమార్ ఆ రెండు చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ యంగ్ హీరో త్వరలో తన మూడవ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎస్‌విసిసి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక వైష్ణవ్ ఇప్పటికే క్రిష్ దర్శకత్వం వహించిన తన రెండవ చిత్రం ‘కొండపాలెం’ షూటింగ్ ను పూర్తి చేశాడు.