కుంభమేళాలో పూసలమ్ముతూ, తన అందమైన కనులతో సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా, ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఆమె తొలి సినిమాగా రాబోతున్న చిత్రానికి ‘లైఫ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సాయిచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం బుధవారం నాడు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజ కార్యక్రమంతో ‘లైఫ్’ చిత్రం ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.
Also Read:Mithra Mandali : “మిత్ర మండలి” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మీడియా సమావేశంలో చిత్ర బృందం తమ అనుభవాలను పంచుకుంది. నిర్మాత అంజయ్య మాట్లాడుతూ…
“ఈరోజు సినిమాను ప్రారంభించాం. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుంది. సరికొత్త ప్రయోగంగా ‘లైఫ్’ సినిమాను ఆరంభించాం. కుంభమేళాలో చిన్న వ్యాపారం చేసి ఇండియా మొత్తం ప్రజాదరణ పొందిన అమ్మాయితో సినిమా చేస్తే క్రేజ్ వస్తుందని అనుకున్నాను. అనుకున్నట్లుగానే దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మోనాలిసాను హీరోయిన్‌గా ఎంపిక చేశాం. ఈ చిత్ర కథ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ఘటనల ఆధారంగా ఉంటుంది. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు.
హీరో సాయి చరణ్ మాట్లాడుతూ “దర్శకుడిని నేను కలిసిన రోజునే కథకు సరిపోతావని చెప్పారు. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో ‘లైఫ్’ చిత్రం రూపొందుతోంది. ఇందులో చక్కటి సందేశం కూడా ఇమిడి ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని” అన్నారు. కథానాయిక మోనాలిసా మాట్లాడుతూ “హైదరాబాద్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. నాతో తెలుగు సినిమా చేయడం చెప్పలేని ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు రాదు కానీ త్వరలో తెలుగు నేర్చుకుంటా. హీరోయిన్‌గా చేస్తున్న ‘లైఫ్’ సినిమా అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని” అన్నారు. ‘లైఫ్’ చిత్రం సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కథాంశంతో, మోనాలిసా క్రేజ్‌తో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.