Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి మెగాస్టార్ ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ప్రాథమిక చర్చలు జరిపిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ ఊహాగానాలు షికారు చేశాయి. గతంలో గుజరాత్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన రీతిలోనే, ఏపీ రూపురేఖలను మార్చేందుకు చిరంజీవిని రంగంలోకి దించబోతున్నారని విస్తృత ప్రచారం జరిగింది.

అయితే, ఈ ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి పిఆర్ (PR) టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది..ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి నియామకంపై ఎలాంటి చర్చలు లేదా నిర్ణయాలు జరగలేదని తేల్చిచెప్పింది. అనవసరమైన ఊహాగానాలు, ఆధారాల్లేని వార్తలను నమ్మవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో గత కొద్దిరోజులుగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న వార్తలకు తెరపడినట్లయింది.