వైవిధ్యమైన నటుడిగా, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా హీరో మంచు మనోజ్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. తన భార్య భూమా మౌనికా రెడ్డి రాజకీయ రంగప్రవేశంపై మనోజ్ క్లారిటీ ఇవ్వడమే కాకుండా, తన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో ఉన్న విభేదాలపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మనోజ్-మౌనిక దంపతులు ఇటీవల ‘ఐక్య ధైర్య సేవ సమితి ట్రస్ట్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరవుతున్న తరుణంలో, మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలపై మనోజ్ స్పందించారు.
భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల వారసురాలిగా మౌనికకు రాజకీయాలు కొత్తేమీ కాదని.. భవిష్యత్తులో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని మనోజ్ స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ అడుగు పడబోతోందని ఆయన హింట్ ఇచ్చారు. ‘మంచు వారి కోడలు’ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో రాయలసీమ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే ప్రెస్ మీట్‌లో విలేఖరులు మనోజ్ తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రస్తావన తీసుకువచ్చారు. “నాకు, మా నాన్నకు మధ్య ఉన్న విభేదాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం.. మీరు నేరుగా ఆయన్నే అడిగి తెలుసుకోవాలి. కాకపోతే.. ఆ ప్రశ్న అడిగేటప్పుడు విలేఖరులు హెల్మెట్లు వేసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు” అంటూ మనోజ్ పంచ్ వేశారు.
