సినిమా షూటింగ్ ముగించుకుని విశ్రాంతి తీసుకుందామని హోటల్ గదికి వెళ్లిన ఆ టెక్నీషియన్ కు అదే ఆఖరి ప్రాజెక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆస్పత్రి పాలైనా, ప్రాణాపాయం తప్పిందని, తమతో నవ్వుతూ మాట్లాడుతున్నాడని సంతోషించే లోపే విధి పగబట్టింది. అంతా సవ్యంగా ఉందనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించి మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూశారు. కోలుకుంటున్న మనిషి అర్ధరాత్రి హఠాత్తుగా ప్రాణాలు విడవడంతో మాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ హీరోగా నటిస్తున్న ‘హెనోక్’ సినిమా షూటింగ్ కేరళలోని ఆలప్పుజ (ఆలెప్పి)లో జరుగుతోంది. శనివారం రాత్రి తన షూటింగ్ బాధ్యతలు పూర్తి చేసుకుని హోటల్ గదికి చేరుకున్న షాజీ కుమార్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన శారీరక అస్వస్థత ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన ఆయన, చిత్ర దర్శకుడు ఉల్లాస్ కృష్ణకు సమాచారం అందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిత్ర బృందం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎర్నాకులంలోని మెడికల్ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాజీ కుమార్ వేగంగా కోలుకున్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన వారితో పాటు, చిత్ర బృందంతో ఆయన ఎప్పటిలాగే సాధారణంగా మాట్లాడారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అయి మళ్లీ కెమెరా పట్టుకుంటారని అంతా భావించారు. కానీ సోమవారం రాత్రి ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కళ్లెదుటే నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి గంటల వ్యవధిలో విగతజీవిగా మారడం ఆస్పత్రిలోని ఆయన సన్నిహితులను కంటతడి పెట్టించింది. తిరువనంతపురానికి చెందిన షాజీ కుమార్, దశాబ్దాలుగా ఎర్నాకులం సమీపంలోని పెరుంబావూరులో స్థిరపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని కలూర్‌లోని గోకులం కన్వెన్షన్ సెంటర్లో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు పెరుంబావూరులోని ఆయన స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2001లో ‘ఉత్తమన్’ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా (డి.ఓ.పి) ప్రయాణం మొదలుపెట్టిన షాజీ కుమార్, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. కాలంతో పాటు తనను తాను అప్ డేట్ చేసుకుంటూ, సీనియర్ల దగ్గరి నుంచి నేటి తరం యువ దర్శకుల వరకు అందరితోనూ పని చేసిన గొప్ప టెక్నీషియన్ గా ఆయనకు పేరుంది. ఆయన ఆకస్మిక మరణం మలయాళ సినిమాకు తీరని లోటు.

