వెండితెరపై కరడుగట్టిన విలన్‌గా, క్రూరమైన పోలీస్ అధికారిగా మెప్పించిన మలయాళ నటుడు శ్రీజిత్ రవికి కోర్టు గట్టి షాకిచ్చింది. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మలయాళ పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీజిత్ రవి, తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ‘కుంకీ’ చిత్రంలో ఫారెస్ట్ రేంజర్‌గా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆయన నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘వేట్టై’, ‘కథాకళి’ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అయితే, తెరపై విలనిజం పండించే ఈ నటుడు నిజ జీవితంలో చేసిన ఓ నీచమైన పని ఇప్పుడు ఆయన్ను కటకటాల పాలు చేసింది.
అసలు విషయం ఏంటంటే.. 2022లో కేరళలోని త్రిసూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలు తమ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి కారులో వారిని వెంబడించాడు. అంతటితో ఆగకుండా, ఆ చిన్నారుల ఎదుట అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో ఆ వ్యక్తి ప్రముఖ నటుడు శ్రీజిత్ రవి అని తేలడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, న్యాయస్థానంలో విచారణ మాత్రం ఆగలేదు. నాలుగేళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో నేరం రుజువు కావడంతో తాజాగా కోర్టు తుది తీర్పును ప్రకటించింది. శ్రీజిత్ రవికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ జరిమానా మొత్తాన్ని బాధిత బాలికలిద్దరికీ సమానంగా నష్టపరిహారం కింద అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటుడికి ఇలాంటి కేసులో శిక్ష పడటం ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది.

