Varanasi Movie First Half, Interval and Climax Details: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసి సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న ట్వీట్ ప్రకారం.. సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకు, అతడి తండ్రికి మధ్య ఉండే భావోద్వేగ బంధం కథలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో తండ్రి–కొడుకుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందట. గ్లోబ్‌ట్రాటర్‌గా కనిపించే రుద్ర.. కథలో కీలకమైన సమయంలో రాముడి రూపంలోకి మారతాడట. విల్లు, బాణంతో రుద్రను రాముడి తరహా రూపంలో చూపించే సన్నివేశం ఇంటర్వెల్‌లో భారీ హైప్‌ను తీసుకురానుందని తెలుస్తోంది.
వారణాసి క్లైమాక్స్ అదిరిపోద్దట. టైమ్‌ట్రాటర్‌గా మారిన రుద్ర.. చివర్లో వారణాసిలో కుంభతో తలపడతాడని ప్రచారం జరుగుతోంది. రుద్ర, కుంభ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌ను జక్కన్న డిజైన్ చేశారట. అయితే తాజాగా వైరల్ అవుతున్న తండ్రి–కొడుకు ఎమోషన్, ఇంటర్వెల్‌లో రుద్ర రాముడిగా మారడం, క్లైమాక్స్‌లో రుద్ర–కుంభ పోరాటం వంటి వివరాలకు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ధృవీకరణ లేదు. ఈ మేరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. ఇక మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ కావడంతో వారణాసిపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సినిమాలోని పాత్రలు, కథా నేపథ్యం, టైమ్ ట్రావెల్ అంశాలు, రామాయణంతో సంబంధం వంటి విషయాలు అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానుంది.

