సుమంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ జగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. సినిమాలోని ఆధ్యాత్మిక, సస్పెన్స్ ఎలిమెంట్స్‌ని రివీల్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. పరమశివుడి ఆజ్ఞతో మహేంద్రగిరిలో కొలువుదీరిన వారణాసి గ్రామదేవత వారాహి మాత చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మహేంద్రగిరి రాజకుటుంబానికి చెందిన వారు గత 150 ఏళ్లుగా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటారు.
ఇదంతా అమ్మవారి శాపం వల్లే జరుగుతోందని స్థానికులు బలంగా నమ్ముతుంటారు. అయితే, ఈ వరుస మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఛేదించడానికి హీరో దైవశక్తితోనే తలపడే సాహసం చేయడం ట్రైలర్‌లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా చూపించారు. అపారమైన భక్తి, మిస్టరీ, సస్పెన్స్ అంశాలను కలగలిపి దర్శకుడు సంతోష్ జగర్లపూడి ఈ కథనాన్ని ఆసక్తికరంగా మలిచారు. ఈ సినిమాలో సుమంత్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టగా, వారాహి మాతగా ఐశ్వర్య రాజేష్ నటించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ ట్రైలర్‌లో ఎంట్రీ ఇచ్చి అందరికీ మైండ్ బ్లాంక్ చేశాడు. సిద్ధు ఒక కీలక పాత్రలో సర్ ప్రైజ్ చేయడం సినిమాపై హైప్ ను అమాంతం పెంచేసింది. వీరితో పాటు మినాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, అలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

