వేసవి సెలవుల్లో వినోదాన్ని అందించేందుకు థియేటర్లలో విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ప్రేక్షకుల నుంచి అమోఘమైన స్పందనను రాబడుతూ, భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకెళ్తోంది. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన పాటలతో పాటు, తమన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. భారీ అంచనాలతో మార్చి 28న విడుదలైన ఈ చిత్రం, థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘మ్యాడ్’ కంటే రెట్టింపు వినోదాన్ని ‘మ్యాడ్ స్క్వేర్’తో అందిస్తామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టారా?
నిస్సందేహంగా. మేము స్వయంగా కొన్ని థియేటర్లకు వెళ్లి ప్రేక్షకుల స్పందనను చూశాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సినిమాను ఆస్వాదిస్తూ ఎంతగానో ఆనందిస్తున్నారు. ‘మ్యాడ్’ ఎక్కువగా యువతను ఆకర్షించగా, ‘మ్యాడ్ స్క్వేర్’ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ స్థాయి స్పందనను ముందుగా ఊహించారా?
లేదు. సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని నమ్మకం ఉంది కానీ, ‘మ్యాడ్-1’ పూర్తి రన్ కలెక్షన్స్‌ను తొలి రోజే సాధించే స్థాయిలో అంచనాలు ఉంటాయని అస్సలు ఊహించలేదు.
“పెద్ద కథ ఆశించి సినిమాకు రావొద్దు, సరదాగా నవ్వుకోవడానికి రండి” అని ముందుగా చెప్పడం ఎంతవరకు సానుకూలంగా పనిచేసింది?
ఇది చాలా పెద్ద ప్లస్ అయింది. సినిమా ఎలా ఉంటుందో ముందే చెప్పడం వల్ల ప్రేక్షకులు దానికి తగ్గ అంచనాలతో థియేటర్‌కు వస్తారు. రాజమౌళి గారు కూడా సినిమా ప్రారంభానికి ముందే కథ గురించి సూచనలు ఇస్తారు. ఇలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందస్తుగా సిద్ధం చేసినట్లు అవుతుంది.
సెకండ్ హాఫ్ నీరసంగా ఉందనే విమర్శలు కొన్ని వచ్చాయి కదా?
మొదటి షోలో కొందరు అలా అన్నారు కానీ, ఆ తర్వాత షోల నుంచి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సునీల్ గారు, మురళీధర్ గారి మధ్య వచ్చే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను బాగా నవ్వించాయి. ఆంథోనీ పాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది.
మీకు వచ్చిన ఉత్తమ ప్రశంస ఏమిటి?
నా స్నేహితుడి తల్లి దాదాపు 15 ఏళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూసి, సినిమాకు తీసుకెళ్లమని కోరారట. సినిమా చూస్తూ నవ్వి నవ్వి కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారట. ఆ వయసు వారు నా సినిమా చూసి ఇంతలా ఆనందించారని చెప్పడం నాకు అత్యుత్తమ ప్రశంసగా అనిపిస్తుంది.
నిర్మాత చినబాబు గారి గురించి?
చినబాబు గారు మొదటి నుంచి మాకు పూర్తి మద్దతుగా నిలిచారు. రచన, చిత్రీకరణ విషయాల్లో ఆయన ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు.
ఎడిటర్ నవీన్ నూలి గారి గురించి?
ఈ సినిమా ఇంత బాగా రావడంలో నవీన్ నూలి గారి కృషి చాలా ఉంది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్ చేయడం కాకుండా, చిత్రీకరణ దశ నుంచే మాతో కలిసి పనిచేశారు. ప్రతి షెడ్యూల్‌కు ముందు ఆయనతో చర్చించి, సినిమా సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూశాం.
ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా ఉంది. 1 మిలియన్ అనేది పెద్ద మైలురాయి కదా. అలాంటిది తక్కువ సమయంలో ఆ లక్ష్యాన్ని చేరడం ఆనందదాయకంగా ఉంది.
రవితేజ గారితో సూపర్ హీరో సినిమా చేయబోతున్నారు కదా. అందులో కామెడీ ఉంటుందా?
తప్పకుండా కామెడీ ఉంటుంది. అలాగే, సినిమా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. సూపర్ హీరోకి ఒక బలమైన నేపథ్య కథ ఉంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, పూర్తిగా ఊహాత్మక కథ.
మీ బలం ఏమిటి?
కామెడీ అయినా, భావోద్వేగం అయినా, అది అనూహ్యంగా ఉండాలి. అలా తీసుకురావడమే నా బలమని నమ్ముతాను. ప్రేక్షకులు ఇప్పుడు ఇది జరుగుతుందని ఊహించినప్పుడు, అది జరగకూడదు. కానీ అది నమ్మశక్యంగా, ఆకట్టుకునేలా ఉండాలి.
వరుసగా కామెడీ సినిమాలు చేయడానికి కారణం?
ఈ మధ్య ప్రజల్లో సీరియస్‌నెస్ ఎక్కువైపోతోంది. చిన్న విషయాలకు కూడా నిరాశకు లోనవుతున్నారు. అందుకే ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ చిత్రాలు తీస్తున్నాను. అంతేకాదు, కామెడీ సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.