బాలీవుడ్ బిగ్ స్టార్స్ కి కరోనా లాక్ డౌన్స్ బలమైన పాఠాల్నే నేర్పుతున్నాయి. పోయిన ఏడాది ఫస్ట్ లాక్ డౌన్ లో అక్షయ్ కుమార్ సహా చాలా మంచి స్టార్స్ తమ సినిమాలతో ఓటీటీ వేదికలపైకి వచ్చేశారు. లాభనష్టాలు ఎలా ఉన్నా థియేటర్లు లేకపోవటంతో ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి వచ్చేయటమే బెటర్ అని బాలీవుడ్ భావించింది. అయితే, 2020 తరువాత 2021లో కూడా కరోనా ఇంకా షాకిస్తూనే ఉంది. అందుకే, మళ్లీ బాలీవుడ్ కి ఓటీటీ బాట తప్పటం లేదు…
బాలీవుడ్ లోని బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరుగా ‘బజ్రంగీ భాయ్ జాన్’ సల్మాన్ ను భావిస్తారు. ఆయనే థియేటర్ల కోసం వెయిట్ చేయటంలో లాభం లేదని డిసైడ్ అయ్యి ఆన్ లైన్ లో వచ్చేశాడు. ‘రాధే’ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి సల్మాన్ లాంటి మాస్ హీరోనే కరోనా ఎఫెక్ట్ తో మాస్క్ వేసుకుని ఓటీటీకి వచ్చేస్తే… విద్యా బాలన్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఆమె కూడా మరోసారి అమేజాన్ ప్రైమ్ బాట పట్టింది.
పోయిన సంవత్సరం ‘శకుంతలా దేవీ’ సినిమాతో ఆన్ లైన్ లో సందడి చేసి మన వెర్సటైల్ విద్యా బాలన్. అయితే, ఇప్పుడు మరోసారి అమేజాన్ ద్వారా అభిమానుల్ని కలుసుకోబోతోంది. ‘షేర్నీ’ సినిమా ప్రైమ్ లో వచ్చేస్తోందంటూ విద్యా స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ… జూన్ లో అంటూ హింట్ ఇచ్చింది. అంటే విద్యా అభిమానులు వచ్చే నెలలో ఆమె నటించిన ‘షేర్నీ’ సినిమాను నెట్ ఇంట్లో, నట్టింట్లో చూసేయొచ్చన్నమాట!