LGBT: శంకరాభరణం లాంటి చరిత్ర సృష్టిస్తుంది: ఎల్బీ శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Lb Sreeram

Lb Sreeram

దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ కోర్ట్‌రూమ్ డ్రామా “ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్“. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా, గే మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న దేశవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో గే, ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం అండగా నిలుస్తున్న పలు సేవా సంస్థల నిర్వాహకులను చిత్ర యూనిట్ ఘనంగా సత్కరించింది.

సక్సెస్ మీట్‌లో సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “ఈ సినిమాతో సునీల్ కుమార్ రెడ్డి ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. గే, ట్రాన్స్ జెండర్ల సమస్యలను ఇంత నిర్భయంగా ప్రస్తావిస్తూ వచ్చిన తొలి పూర్తిస్థాయి చిత్రం ఇదే. గతంలో ‘శంకరాభరణం’ సినిమా ఎలాంటి చరిత్ర సృష్టించిందో.. ఈ అర్థనారీశ్వర కథాంశంతో వచ్చిన చిత్రం కూడా మరో చరిత్ర సృష్టించబోతోంది. నా కెరీర్‌లో ‘అమ్మో ఒకటో తారీఖు’ చిత్రం ఎంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందో.. ఈ సినిమా కూడా అంతే గుర్తింపు తెచ్చిపెడుతుంది” అని ఎల్బీ శ్రీరామ్ కొనియాడారు.

×
×
Ad

చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు, ఛారిటీ సంస్థలకు ధన్యవాదాలు. సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొంటున్న వివక్ష పూర్తిగా తొలగిపోవాలని, వారికీ అందరిలాగే సమానత్వం దక్కాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సినిమాను రూపొందించాను. థియేటర్ల నుండి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే సమాజంలో ఒక మంచి మార్పునకు గట్టి అడుగు పడిందని నమ్ముతున్నాను” అని స్పష్టం చేశారు.