జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొని, భారత సైనికులకు సంఘీభావం తెలిపారు.
Also Read: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..
ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సెక్రటేరియట్ జంక్షన్ ద్వారా మిలటరీ ట్యాంక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. “భారత్ మాతా కీ జై”, “జై హింద్” నినాదాలతో ర్యాలీ వాతావరణం దేశభక్తితో నిండిపోయింది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటి మరియు మాజీ ఎంపీ జయప్రద, నటి మంచు లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినీ నటి మరియు మాజీ ఎంపీ జయప్రద మాట్లాడుతూ, “ఈ రోజు మనమంతా గర్వించదగ్గ రోజు. వేలాది మంది ప్రజలు ‘మేమున్నాం’ అంటూ భారత మాతకు జై కొట్టారు. ఈ ఆపరేషన్‌తో మన సైనికులు పహల్గాం బాధితుల కన్నీళ్లను తుడిచారు. మతం పేరుతో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు,” అని అన్నారు.
Also Read:AP Liquor Scam Case: ఏసీబీ కోర్టులో కీలక వాదనలు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధింపు
నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ, “ఇంత గొప్ప వేడుకకు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. మన సైనికులకు సెల్యూట్ చేయాలి. ఎవరికీ యుద్ధం ఇష్టం ఉండదు, కానీ కొన్ని సమయాల్లో అది అనివార్యం. మన దేశంలోకి చొరబడి, అమాయక ప్రజలను హతమార్చిన వారికి మోదీ ఆధ్వర్యంలో మన సైనికులు నిశ్శబ్దంగా, ఖచ్చితమైన దాడులతో జవాబు చెప్పారు. పహల్గాం బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు మహిళలు ఈ ఆపరేషన్ గురించి మాట్లాడినప్పుడు నాకు గర్వంగా అనిపించింది. ఇది ఒక్కరి విజయం కాదు, మన అందరి విజయం. అమరుడైన మురళి నాయక్‌ను తలచుకుందాం,” అని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.
