Krishnamraju bonds in cinema are attachments: నటరత్నతో రెబల్ స్టార్ అనుబంధం!
పౌరాణికాలలో యన్టీఆర్, సాంఘికాలలో ఏయన్నార్ అభినయం అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ముఖ్యంగా యన్టీఆర్ ను శ్రీకృష్ణునిగా తెరపై చూడడమంటే ఆయనకు ఎంతోఇష్టం. అలాంటి నటరత్న యన్టీఆర్ ను కృష్ణంరాజు తొలిసారి కలుసుకున్నదీ ఆయన కృష్ణుని గెటప్ లోఉండగానే! `శ్రీకృష్ణతులాభారం` చిత్రంలో యన్టీఆర్ శ్రీకృష్ణుని వేషంలో ఉండగా ఆయనను తొలిసారి కలుసుకున్నారు కృష్ణంరాజు. ఆ సమయంలో యన్టీఆర్ తనపై చూపిన ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోలేనని చెప్పేవారు కృష్ణంరాజు. ఆరడుగుల ఎత్తున ఉన్నకృష్ణంరాజు చూపరులను ఇట్టే ఆకట్టుకొనేవారు. అందువల్ల యన్టీఆర్, కృష్ణంరాజుకు తగ్గ పాత్రలు తన చిత్రాలలో ఏవైనా ఉంటే తప్పకుండా ఇప్పించేవారు. అలా యన్టీఆర్ తో కలసి కృష్ణంరాజు “భలే మాస్టర్, బడిపంతులు, మనుషుల్లో దేవుడు, మంచికి మరోపేరు, పల్లెటూరి చిన్నోడు, వాడే-వీడు, సతీసావిత్రి“ చిత్రాలలో నటించారు. యన్టీఆర్ తరువాత కొన్ని పాత్రలకు కృష్ణంరాజు మాత్రమే న్యాయం చేయగలరని అప్పటి రచయితలు, దర్శకులు నిర్ణయించారు. అలా రూపొందిన `బొబ్బిలి బ్రహ్మన్న` చిత్రంతో కృష్ణంరాజు జేజేలు అందుకున్నారు. తాండ్ర పాపారాయుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి పాత్రల్లోనూ నటించి అలరించారు.
అక్కినేనితో కృష్ణంరాజు బంధం!
ఏయన్నార్ నటించిన `దేవదాసు` చిత్రమంటే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టం. ఆ సినిమాను పలుమార్లు చూశానని కృష్ణంరాజు చెప్పుకున్నారు. కృష్ణంరాజులోని నటుణ్ణి ఏయన్నార్ సైతం ప్రోత్సహించారు. ఏయన్నార్ తో కలసి కృష్ణంరాజు “బుద్ధిమంతుడు, జై జవాన్, పవిత్రబంధం, రైతుకుటుంబం, మంచిరోజులు వచ్చాయి, కన్నకొడుకు, యస్.పి.భయంకర్“ మొదలైన చిత్రాలలో నటించారు.
కృష్ణ- కృష్ణంరాజు అనుబంధం!
కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో చిత్రసీమలో ప్రవేశించారు. కృష్ణకు ఆరంభంలోనే హీరోగా అవకాశాలు లభించాయి. అయితే ఇద్దరూ పలు చిత్రాలలో పోటీ పడి నటించారు. కృష్ణ నటించిన అనేక చిత్రాలలో కృష్ణంరాజు విలన్ గా మెప్పించారు. తరువాత ఇద్దరూ కలసి హీరోలుగానూ నటించిన చిత్రాలు జనాన్ని అలరించాయి. కృష్ణతో కృష్ణంరాజు “నేనంటే నేనే, మళ్ళీ పెళ్ళి, అమ్మకోసం, పెళ్ళిసంబంధం, అల్లుడే మేనల్లుడు, అనురాధ, రాజ్ మహల్, అంతా మనమంచికే, హంతకులు- దేవాంతకులు, భలే మోసగాడు, ఇన్ స్పెక్టర్ భార్య, ఇల్లు ఇల్లాలు, తల్లీకొడుకులు, శ్రీవారు-మావారు, మమత, మాయదారి మల్లిగాడు, స్నేహబంధం, కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, యుద్ధం, విశ్వనాథనాయకుడు, ఇంద్రభవనం, సుల్తాన్“వంటి చిత్రాలలో నటించారు.
శోభన్ బాబు – కృష్ణంరాజు మైత్రీబంధం!
శోభన్ బాబు, కృష్ణంరాజు ఇద్దరూ స్టార్ డమ్ చేరుకోవడానికి పలు పాట్లు పడ్డారు. దాంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం నెలకొంది. ఒకరి ఇంటి విషయాలు, మరొకరు చెప్పుకొని ముచ్చటించుకొనేంత స్నేహం తమ మధ్య ఉండేదని కృష్ణంరాజు చెప్పుకొనేవారు. శోభన్ బాబు మద్రాసులో సొంత ఇల్లు కట్టించుకొనే సమయంలో కృష్ణంరాజుకు తెలిసిన కాంట్రాక్టర్ తోనే నిర్మాణం సాగిందట! శోభన్ ఇంట్లో ఓ గదిలో యన్టీఆర్ పెద్ద ఫోటో ఉంటుందని కృష్ణంరాజు చెప్పే వరకు చాలామందికి తెలియదు. శోభన్ ను చిత్రసీమలో ఎంతగానో ప్రోత్సహించిన యన్టీఆర్ పై గౌరవంతో అలా పెద్ద ఫోటో పెట్టుకున్నారని కృష్ణంరాజు తెలిపారు. ఇక వయసులో శోభన్ బాబు కాసింత పెద్ద వారు. దాంతో వారిద్దరూ `బంగారుతల్లి, రామబాణం` వంటిచిత్రాలలో అన్నదమ్ములుగానే నటించారు. వారిద్దరూ కలసి “మానవుడు – దానవుడు, జీవనతరంగాలు, జీవితం, ఇద్దరూ ఇద్దరే, కురుక్షేత్రం“ వంటి చిత్రాలలో అభినయించారు.
నవతరంతో కృష్ణంరాజు బంధం!
కృష్ణంరాజు ఊరికే చెందినవారు చిరంజీవి. అందువల్ల ఆరంభంలో చిరంజీవిని కృష్ణంరాజు ప్రోత్సహించారు. తాను నిర్మించి, నటించిన `మనవూరి పాండవులు` చిత్రంలో చిరంజీవికి కీలకమైన పాత్రను ఇచ్చారు కృష్ణంరాజు. చిరంజీవి ఆయనను `అన్నయ్యా` అంటూఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ తరపున రాజమండ్రి నుండి కృష్ణంరాజు పార్లమెంట్ కు పోటీ కూడాచేశారు. వారిద్దరూ కలసి నటించిన “ప్రేమతరంగాలు, పులి-బెబ్బులి“ వంటి చిత్రాలు అలరించాయి. బాలకృష్ణతోనూ కృష్ణంరాజుకు మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణతో ఆయన “సుల్తాన్, వంశోద్ధారకుడు“వంటి చిత్రాలలో నటించారు. నాగార్జునకు హీరోగా మాస్ ఇమేజ్ సంపాదించి పెట్టిన `కిరాయిదాదా`లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అలాగే `నేటి సిద్ధార్థ`లో వారిద్దరూ కలసి నటించారు. వెంకటేశ్ హీరోగా రూపొందిన `టూ టౌన్ రౌడీ`లో రంజిత్ కుమార్ పాత్రలో నటించి అలరించారు కృష్ణంరాజు. సుమన్ కు ఆయన బావగా నటించిన `బావ-బావమరిది` బంపర్ హిట్ అయింది. తరువాతి తరం హీరోలయిన జగపతిబాబు, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్ వంటివారితోనూ కృష్ణంరాజు కలసి నటించి అలరించారు. ఇక తన నటవారసునిగా జనం ముందు నిలచిన ప్రభాస్ తోకలసి “బిల్లా, రెబల్, రాధేశ్యామ్“ వంటి సినిమాలలో మురిపించారు.
Krishnam Raju: ఆ నలుగురితో ప్రత్యేక అనుబంధం!
